AP Constable Recruitment 2026
* 400 పోస్టులు భర్తీ చేయాల్సిందే!
* మిగిలిన ఖాళీలను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ఆదేశం
* నాలుగు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ
* నోటిఫికేషన్లోని క్లాజ్ 33(9) చెల్లదని కీలక తీర్పు
ఆకేరు న్యూస్, డెస్క్: ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ (AP Police Constable Recruitment) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు హైకోర్టు (AP High Court) శుభవార్త అందించింది. 2022 పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో మిగిలిపోయిన సుమారు 400 ఖాళీలను తదుపరి మెరిట్ అభ్యర్థులతో (Constable Recruitment) భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ నియామక బోర్డును ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా నోటిఫికేషన్లోని క్లాజ్ 33(9)ను ఏకపక్షమైనదిగా, చెల్లనిదిగా ప్రకటించింది.
2022 నవంబర్ 28న ఏపీ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (SLPRB) కానిస్టేబుల్ పోస్టుల (Constable Recruitment) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్షలు, శారీరక సామర్థ్య పరీక్షలు తదితర ఎంపిక ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను ప్రకటించింది. అయితే సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షలు, ఇతర ధ్రువీకరణ ప్రక్రియల సమయంలో కొందరు అభ్యర్థులు వివిధ కారణాలతో నియామక ప్రక్రియ నుంచి తప్పుకున్నారు. దీంతో సుమారు 400 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.
* వెయిటింగ్ లిస్ట్ లేదన్న నియామక బోర్డు..
మిగిలిపోయిన ఖాళీలను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని అర్హులైన అభ్యర్థులు కోరారు. అయితే నోటిఫికేషన్లోని క్లాజ్ 33(9) ప్రకారం వెయిటింగ్ లిస్ట్ ఉండదని, మిగిలిపోయిన ఖాళీలు రద్దవుతాయని నియామక బోర్డు పేర్కొంది. దీంతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
* క్లాజ్ 33(9) చెల్లదన్న హైకోర్టు..
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ న్యాపతి విజయ్ కీలక తీర్పు వెలువరించారు. ప్రొవిజనల్ ఎంపిక జాబితా అనేది నియామక ప్రక్రియలో ప్రాథమిక దశ మాత్రమేనని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షలు, ఇతర ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తయ్యే వరకు అభ్యర్థుల ఎంపికకు తుది రూపం రాదని స్పష్టం చేశారు.
నియామక ప్రక్రియ ప్రారంభ దశలోనే కొందరు అభ్యర్థులు తప్పుకున్నప్పుడు, వారి స్థానంలో మెరిట్ ప్రకారం తదుపరి అర్హులైన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లోని క్లాజ్ 33(9)ను ఏకపక్షమైనదిగా, అన్యాయమైనదిగా ప్రకటిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
* నాలుగు నెలల్లో 400 పోస్టులు భర్తీ చేయాలి..
మిగిలిపోయిన సుమారు 400 ఖాళీలను మెరిట్, రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా తదుపరి అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు అందిన తేదీ నుంచి నాలుగు నెలల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో 2022 పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ఖాళీగా మిగిలిన పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరట లభించినట్లయింది. అయితే మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే ఈ పోస్టుల భర్తీకి పరిగణనలోకి తీసుకోనున్నారు.
Also Read : హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

