ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
* ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..
* ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం
ఆకేరు న్యూస్, కోట : రాజస్థాన్‌లోని కోట-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై (Kota Udaipur Highway Accident) శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంభుపుర గ్రామం వద్ద వేగంగా దూసుకొచ్చిన ఒక క్రూజర్ వాహనం.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మహారాష్ట్రలోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోగా.. లారీ డ్రైవర్‌తో సహా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
* అసలేం జరిగిందంటే?
నాంతా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం (Kota Udaipur Highway Accident) చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 36 మంది సభ్యులు మంగళవారం తీర్థయాత్రలకు బయలుదేరారు. మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్, రాజస్థాన్‌లోని పుష్కర్, ఖాటూశ్యామ్‌జీ ఆలయాలను దర్శించుకున్న అనంతరం, మూడు వేర్వేరు వాహనాల్లో స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు.
అన్ని వాహనాలు ఒకదాని వెనుక ఒకటి వెళ్తుండగా, ముందు వెళ్తున్న క్రూజర్ వాహనం శంభుపుర వద్ద అదుపుతప్పింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఢీకొట్టిన వేగానికి క్రూజర్ ముందు భాగం నుజ్జునుజ్జయి, అందులో ప్రయాణిస్తున్న వారు లోపలే ఇరుక్కుపోయారు. వెనుక వాహనాల్లో వస్తున్న కుటుంబ సభ్యులు ఈ భయానక దృశ్యాన్ని భయాందోళనకు గురయ్యారు.
* ఆస్పత్రిలో మరొకరి మృతి..
ఈ ప్రమాదంలో క్రూజర్‌లో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మాధవి అనే మహిళను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె కూడా తుదిశ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. మృతులను ఉషా బాయి, సుశీల (55), కైలాష్ (45), సాన్వి, సజ్జన్, అనిత, బాబూలాల్ (60), జాన్వి (13), మాధవిలుగా గుర్తించారు.
ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్ హారూన్ (43) మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా నివాసి. లారీలో సాంకేతిక లోపం తలెత్తడంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి, కొద్దిదూరంలో నిలబడి పరిశీలిస్తున్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన క్రూజర్ ముందుగా హారూన్ను ఢీకొట్టి, ఆపై లారీ వెనుక భాగంలోకి దూసుకెళ్లింది. ఈ ధాటికి హారూన్ దాదాపు 20 అడుగుల దూరంలో ఎగిరిపడి స్పృహ కోల్పోయాడు. పది నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చిన అతను, తలకు, మోకాళ్లకు గాయాలైనప్పటికీ పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించాడు.
* సహాయక చర్యలు, గాయపడిన వారి వివరాలు..
సమాచారం అందుకున్న నాంతా పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిటీ ఎస్పీ తేజస్విని గౌతమ్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. స్థానికుల సహాయంతో నుజ్జునుజ్జయిన వాహనం నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీసి కోటలోని న్యూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిలో మూడేళ్ల చిన్నారి సృజేత్తో పాటు జగదీష్ (10), మయూరి పవార్ (20), మనీషా పవార్ (45), శరద్ పవార్ (46), గణేష్ పవార్ (30), లారీ డ్రైవర్ హారూన్ (43) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మనీషాకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మిగిలిన క్షతగాత్రులందరి పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అశుతోష్ శర్మ తెలిపారు. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది మరణించడంతో ధూలేలోని వారి స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

