Matrimony Hawala Scam Hyderabad
* నలుగురు అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలో మరో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. పెళ్లి సంబంధాల పేరుతో వల వేసి, నకిలీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఏకంగా ₹1,46,00,000 (కోటీ 46 లక్షల రూపాయలు) దోచుకున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బాధితుడు ‘సంగం మ్యాట్రిమోనీ’ వెబ్సైట్లో పెళ్లి సంబంధాల కోసం వెతుకుతుండగా, నిందితులు ఒక మహిళ పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి అతనికి పరిచయమయ్యారు. బాధితుడితో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ, తానే ఆ మహిళనంటూ నమ్మబలికారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మెల్లగా అసలు రంగు బయటపెట్టారు. ఒక నకిలీ ఇన్వెస్ట్మెంట్ (పెట్టుబడుల) ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసి, ఇందులో డబ్బులు పెడితే భారీ లాభాలు వస్తాయని బాధితుడిని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు విడతల వారీగా దాదాపు ₹46.65 లక్షల రూపాయలను నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
* సింగపూర్‌కు హవాలా లింకులు..
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. నిందితులు అమాయకుల పేరిట తెరిచిన ‘మ్యూల్ బ్యాంక్ ఖాతాల’ (Mule Accounts) ద్వారా ఈ నిధులను మళ్లించినట్లు గుర్తించారు. తెలంగాణ, మహారాష్ట్రల్లోని ‘ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్’ ఖాతాల ద్వారా ఈ భారీ సొమ్ము చేతులు మారింది. ఈ విధంగా సేకరించిన మోసపూరిత సొమ్మును హవాలా నెట్వర్క్ ద్వారా ఏకంగా సింగపూర్‌లోని సైబర్ ముఠాలకు చేరవేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొత్తం మీద ఈ లింకుల ద్వారా రూ. 1.46 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.
* నిందితుల వివరాలు..
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో…చొక్కాల సంపత్ (సిద్దిపేట), హెచ్చు నరేష్ (సికింద్రాబాద్), ఎండ్ల సురేష్ (సికింద్రాబాద్), వడ్కల మహేష్ (సికింద్రాబాద్) ఉన్నారు.
ఈ తరహా మ్యాట్రిమోనీ పరిచయాలు, నకిలీ పెట్టుబడి పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు పంపవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మోసపోతే వెంటనే ‘1930’ నంబరుకు ఫిర్యాదు చేయాలని కోరారు.
