Kishan Reddy Voter Registration
* హైదరాబాద్లోనే ఓటుండాలి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలో నివసిస్తున్న ఓటర్లు తమ ఓటు హక్కును ఇక్కడే ఉంచుకోవాలని, ఎలాంటి బెదిరింపులకు లొంగవద్దని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కొంతమంది స్వార్థ రాజకీయ… నాయకులు ఓటర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. “సొంత ఊర్లలోనే ఓట్లను నమోదు చేసుకోవాలని, లేకపోతే ప్రభుత్వ పథకాలు కట్ అవుతాయని, భూములు పోతాయని కొంతమంది ప్రజలను బెదిరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను, బెదిరింపులను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
* హైదరాబాద్ ఓటుకే ప్రాధాన్యత..
ఉపాధి, ఉద్యోగాల రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన వారు ఇక్కడి ఓటు హక్కుకే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రమంత్రి సూచించారు. నగరంలో ఓటు నమోదు చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం జరగదని, భవిష్యత్తులో అవసరాన్ని బట్టి, మీ వీలును బట్టి ఎప్పుడైనా మళ్లీ మీ సొంత ప్రాంతాలకు ఓటును మార్చుకునే అవకాశం చట్టబద్ధంగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ఓటర్ల జాబితా సవరణకు పూర్తి స్థాయిలో సహకరించాలని, నగర ప్రగతిలో భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి కోరారు.
