Nalgonda Road Accident
ఆకేరు న్యూస్, నల్గొండ: విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65)పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలో మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
* రోడ్డుపైకి దూసుకెళ్లి బోల్తా పడింది..
హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఓ డి-మ్యాక్స్ వి-క్రాస్ (D-Max V-Cross) వాహనం గుండ్రాంపల్లి వద్దకు రాగానే అకస్మాత్తుగా టైర్ పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆ వాహనం వేగంగా వెళ్లి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆ వాహనం డివైడర్ దాటి, అవతలి వైపు (హైదరాబాద్ వైపు వచ్చే) రోడ్డుపైకి దూసుకెళ్లి బోల్తా పడింది.
అదే సమయంలో హైదరాబాద్ వైపు వస్తున్న కియా కారుతో పాటు మరో కారు.. రోడ్డుపై అడ్డంగా పడిన వాహనాన్ని తప్పించబోయి అత్యంత వేగంగా ఢీకొట్టాయి. ఈ క్రమంలో వరుసగా మూడు కార్లు రోడ్డుపైనే బోల్తా పడటంతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. కార్లలోని ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
* 8 మందికి తీవ్ర గాయాలు..
ఈ ముప్పేట ప్రమాదంలో మూడు కార్లలో ప్రయాణిస్తున్న సుమారు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వాహనదారులు, గ్రామస్థులు స్పందించి కార్లలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు, NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ) సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు.
గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం 108 వాహనంలో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
* 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
హైవేపై మూడు కార్లు బోల్తా పడి అడ్డంగా నిలిచిపోవడంతో హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. సుమారు 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
