Hanamkonda Collector Chahat Bajpai
ఆకేరు న్యూస్, హనుమకొండ:
ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి (Collector Chahat Bajpai) అన్నారు. విద్యార్థుల్లో పఠన సామర్థ్యం, గణిత నైపుణ్యాలు, ఆలోచనా శక్తిని పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని ఆమె పిలుపునిచ్చారు.
బుధవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి ఐదో తరగతి విద్యార్థులకు గణిత పాఠ్యాంశాన్ని బోధించారు. ఒక చేత్తో గణిత పాఠ్యపుస్తకాన్ని, మరో చేత్తో చాక్ పీస్ పట్టి బ్లాక్‌బోర్డుపై స్వయంగా లెక్కలు రాసి విద్యార్థులతో సాధింపజేశారు. వారి అవగాహన, ప్రతిభ, నేర్చుకునే సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించారు.
కలెక్టర్ స్వయంగా బోధించడంతో విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఆమె ఉపాధ్యాయురాలిగా మారి పాఠాలు చెప్పడం అక్కడి టీచరులకు సైతం స్ఫూర్తినిచ్చింది. గణిత పాఠ్యాంశాన్ని సులువుగా అర్థమయ్యేట్టు బోధించడంతో పాఠశాల విద్యార్థులు ఎంతో సంబరపడ్డారు.
* ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు..
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. ఆనందంతో కలెక్టర్ మాట్లాడారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, ప్రతి విద్యార్థి ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడం ద్వారా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యార్థుల సంఖ్యను పెంచుకోవచ్చునని అన్నారు.
ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచాలని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, గణితం లెక్కలు చేయడంలో నైపుణ్యం సాధించేలా ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలన్నారు.

Also Read :
* అంగన్వాడీ కేంద్రం, అభివృద్ధి పనుల పరిశీలన..
పాఠశాలలోని తరగతి గదులు, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి వారి తల్లులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న గుడ్లు, బాలామృతం పంపిణీని పరిశీలించి లబ్ధిదారులకు అందజేశారు.


వనమహోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఆ తర్వాత గ్రామంలోని డంపింగ్ యార్డ్, గ్రామపంచాయతీ కార్యాలయంలోని నర్సరీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చింతకుంటపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాంభూపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, జిల్లా శిశు సంక్షేమ అధికారి విశ్వజ, తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
