Kalvakuntla Kavitha Arrest
* టెంట్లు పీకేసిన పోలీసులు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ రేపిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) భూపోరాటం చివరకు ఉద్రిక్తతకు దారితీసింది. నాచారం, బోడుప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి జరిగిన హైడ్రామా అనంతరం, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.
* రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు అరెస్టులు…
తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈరోజు (గురువారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భూపోరాటానికి తెలంగాణ రక్షణ సేన పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యమకారులు, నాయకులు భారీగా తరలివస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని టీఆర్ఎస్ ముఖ్య నాయకులను, ఉద్యమకారులను అర్ధరాత్రి నుంచే పోలీసులు ముందస్తు అరెస్టులు (Pre-emptive arrests) చేశారు.
* నాచారంలో టెంట్ల తొలగింపు.. పోలీసుల ఆంక్షలు
భూపోరాటాన్ని ఎలాగైనా భగ్నం చేయాలని భావించిన పోలీసులు.. ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో నిరసన కోసం ఏర్పాటు చేసిన టెంట్లను, వేదికలను ఉదయాన్నే బలవంతంగా తొలగించారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఎవరినీ అనుమతించకుండా ఆంక్షలు విధించారు.
* బోడుప్పల్‌కు చేరుకున్న కవిత.. ‘రక్షణ కాలనీ’గా నామకరణం
పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులను దాటుకుని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఉదయం అనుకున్న సమయానికే బోడుప్పల్ భూపోరాట ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక ఉద్యమకారులతో కలిసి ఆమె అక్కడ బొడ్రాయిని ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా, ఆ ప్రాంతానికి “తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీ” గా నామకరణం చేశారు. తమ భూములపై తమకే హక్కు ఉంటుందని, ఉద్యమకారుల పొట్టగొడితే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
* తీవ్ర ఉద్రిక్తత కవిత అరెస్ట్…
కవిత రాకతో బోడుప్పల్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. పరిస్థితి చేతులు దాటకుండా చూసేందుకు పోలీసులు భారీగా తరలివచ్చి భూపోరాటాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలకు మధ్య తీవ్ర నెట్టులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు కల్వకుంట్ల కవితను బలవంతంగా అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కవిత అరెస్ట్‌తో ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో ప్రస్తుతం భారీగా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది.
