MLA Yashaswini Reddy Paddy Plantation
ఆకేరు న్యూస్ దేవరుప్పుల :
ఆకాశం వైపు ఆశగా చూసే అన్నదాత కళ్లల్లో.. శ్రమను నమ్ముకున్న కూలీల చెమట చుక్కల్లో..గురువారం మాధాపురం గ్రామ పొలిమేరల్లో ఒక అపురూపమైన దృశ్యం ఆవిష్కృతమైంది. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికార దర్పానికి తావులేకుండా,సామాన్యులలో సామాన్యురాలిగా మారిపోయి అందరినీ అబ్బురపరిచారు.
* ఆకస్మాత్తు గా ఆగిన కాన్వాయ్
మండలంలోని మాధాపురం గ్రామ శివారులో మహిళా కూలీలు లయబద్ధంగా వరి నాట్లు వేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే కారు అటుగా వెళ్తోంది. పొలాల్లో వంగి కష్టపడుతున్న ఆ శ్రమజీవులను చూడగానే ఆమె మనసు స్పందించింది. వెంటనే కారు ఆపించి, గట్ల వెంబడి నడుచుకుంటూ నేరుగా పొలం వద్దకు వెళ్లారు. ఊహించని అతిథిని చూసి మహిళలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
* బురదలో దిగిన పాదాలు.. పూసిన నవ్వులు!
వారితో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే, అక్కడితో ఆగకుండా కాళ్ల చెప్పులు గట్టున విడిచి, ఏమాత్రం సంకోచించకుండా బురద పొలంలోకి దిగారు. పచ్చటి వరినారు కట్టను చేతిలోకి తీసుకుని, అనుభవమున్న రైతు బిడ్డలా వంగి నాట్లు వేయడం ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి తమ పక్కనే నిలబడి బురద మెత్తిన చేతులతో నాట్లు వేస్తుంటే, కూలీల ముఖాల్లో ఆనందం వెల్లువెత్తింది. ఆ పచ్చటి పొలమంతా ఒక్కసారిగా నవ్వుల పువ్వులు పూశాయి.
ఆ బురదలోనే నిలబడి, పక్కనున్న మహిళల కష్ట సుఖాలను, రైతుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెబుతూ.. మనది ప్రజా ప్రభుత్వం.. అన్నదాతలను ఆదుకోవడమే మన మొదటి ప్రాధాన్యత. పెట్టుబడి సహాయం కోసం ‘రైతు భరోసా’ను అందిస్తూనే, సన్న వడ్లు పండించే ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బోనస్ కూడా ఇస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూసే బాధ్యత మాది” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ప్రోటోకాల్ పట్టింపులు పక్కన పెట్టి, బురదను సైతం లెక్కచేయకుండా సామాన్యుల గుండె చప్పుడిని విన్న యశస్విని రెడ్డి తీరు, స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుంది. ఈ దృశ్యం చూసిన వారంతా “ప్రజాప్రతినిధి అంటే ఇలాగే ప్రజల మధ్య ఉండాలి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు
