Hyderabad BRS Protest
* హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు
* కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కొనసాగించాలని డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పేదల పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ప్రతిపక్ష పార్టీ ఆందోళనలు చేపట్టింది. బీఆర్ఎస్ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ముషీరాబాద్, అంబర్‌పేట, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.
* ఆ పథకాల రద్దుకు కుట్ర
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు అండగా నిలిచేందుకు ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్యే ముఠాగోపాల్ విమర్శించారు. సొమవారం బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు షాదిముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ముషీరాబాద్ చౌరస్తాలో ముఠాగోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్‌తో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్లాకార్డులు ప్రదర్శిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
* తులం బంగారం ఏదీ?
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పథకాలు కొనసాగించాలని కోర్టులో పిటిషన్లు వేస్తే సీనియర్ న్యాయవాదులను తీసుకువచ్చి కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు తప్ప పేదలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
* రేవంత్ పాలనపై అసంతృప్తి
తెలంగాణలో కేసీఆర్ బ్రాండ్ కనపడొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని శ్రావణ్ అన్నారు. తెలంగాణ ప్రజలు రేవంత్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా, ముషీరాబాద్ నియోజకవర్గం వివిద డివిజన్ల అఽధ్యక్షులు వై. శ్రీనివాస్‌రావు, శ్రీధర్‌రెడ్డి, బింగి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
* చౌరస్తా జామ్
కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్రపన్నుతున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ముషీరాబాద్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంతో తీవ్ర ట్రాక్ అంతరాయం ఏర్పడింది. ముషీరాబాద్ చౌరస్తా నుంచి గాంధీ ఆసుపత్రి వరకు రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు నిరసన కారులను బలవంతంగా లాగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
