Telangana Secretariat QR Code Entry System
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Secretariat) భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయం లోపలికి ప్రవేశించే ప్రతి వాహనానికి సరికొత్తగా క్యూఆర్ (QR Code) కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇటీవల కాలంలో నకిలీ ఉద్యోగుల సంచారం ఎక్కువ అవ్వడం, సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ముఠాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను తీసుకువచ్చింది.
* స్కాన్ చేస్తేనే లోపలికి ఎంట్రీ…
కొత్త నిబంధనల ప్రకారం, సచివాలయం లోపలికి వెళ్లే ప్రతి వాహనాన్ని గేటు వద్దే నిలిపివేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేయగానే సదరు వాహనం నంబర్, ఓనర్ పేరు, వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్ డేటాబేస్లో ఆటోమేటిక్గా నమోదవుతుంది.
* రంగంలోకి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)….
సచివాలయ భద్రతా బాధ్యతలు చూస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బంది ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. గేటు వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయని ఏ ఒక్క వాహనాన్ని కూడా లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రోజువారీగా సచివాలయంలోకి ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఏయే సమయాల్లో వచ్చి వెళ్తున్నాయనే పూర్తి లెక్కలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఎంట్రీ చేస్తున్నట్లు SPF అధికారులు పేర్కొన్నారు.
ఈ సరికొత్త డిజిటల్ నిబంధన ద్వారా నకిలీ వ్యక్తుల ఆట కట్టించడమే కాకుండా, సచివాలయ భద్రతను వంద శాతం పటిష్టం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
