* కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి
* పార్టీ ప్రణాళికలకు విరుద్ధంగా నిర్ణయాలు
– ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి.. ఇప్పుడు ఎలా పార్టీలో చేర్చుకుంటారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రశ్నించారు. కేసీఆర్ (KCR) చేసిన పొరపాటు కాంగ్రెస్ చేస్తే ఎలా అన్నారు. పార్టీ నిర్ణయాల వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరి మీద కొట్లాడానో, వారినే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం మంచిది కాదు’ అని మండిపడ్డారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎంఎల్ఎ సంజయ్ కుమార్ (Sanjay Kumar) ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నప్పటి నుంచీ రేవంత్ తీరుపై జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. పత్రికల్లో చూసి జగత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ఇదేనా సీనియార్టీకి ఇచ్చిన గౌరవం అన్నారు. ఇంకా తనకు కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్సీ పదవి ఎందుకు అని ప్రశ్నించారు. రాజీనామాకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు ముఖ్యనేతలు ఆయనతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి జీవన్ చేసిన సేవలు వెలకట్టలేనివని, జీవన్ రెడ్డికి న్యాయం జరిగేలా సిఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రాష్ట్ర ఇన్ ఛార్జీ దీపాదాస్ మున్షీ (Deepa Dasmunsi) దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ అన్నారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి అసంతృప్తిగా గానే ఉన్నారు. రాష్ట్రంలో పార్టీకి తగిన సంఖ్యాబలం ఉన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని తప్పుబడుతున్నారు. గతంలో రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టిన పాంచ్ న్యాయ్ (Paanch Nyay) కు విరుద్ధంగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రణాళికలకు వ్యతిరేకంగా పోచారం, సంజయ్‌ను చేర్చుకున్నారని విమర్శించారు.
—————————