* ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి
* రేపు ఉదయం 11 గంటలకు ఓటింగ్
* ఏకగ్రీవం కోసం ఎన్డీఏ కూటమి తీవ్రయత్నాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ ఏర్పడింది. దేశంలోనే తొలిసారిగా ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లా (Om Birla) పోటీలో ఉండగా, విపక్ష కూటమి ఇండియా అభ్యర్థిగా కె. సురేష్ (K Suresh) పోటీలో ఉన్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఓటింగ్ జరగనుంది. స్పీకర్ గా హోం బిర్లా ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మూడు సార్లు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మాట్లాడినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ వెల్లడించారు. అయితే.. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కేటాయించాలని ఇండియా కూటమి పట్టుబడుతోంది. దీనికి ఎన్డీఏ కూటమి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి..
విపక్ష కూటమికి డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని కె.సురేష్ డిమాండ్ చేస్తున్నారు. గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేదని ఆ పదవి ఇవ్వలేదని, ఇప్పుడు ఆ హోదా ఉంది కాబట్టి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని, కానీ అందుకు ఎన్డీఏ సుమఖంగా లేదని తెలిపారు. విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని శరద్‌పవార్ (Sharad Pawar) అన్నారు.
షరతులు విధించడం సరికాదు..
ప్రజాస్వామ్య దేశంలో స్పీకర్ ఎన్నికకు షరతులు విధించడం మంచిది కాదని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. విపక్షానికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలన్న సంప్రదాయం మునుపెన్నడూ లేదని తెలిపారు. షరతులతో ప్రజాస్వామ్యం నడవదన్నారు. విపక్షం స్పీకర్ పదవి కోసం పోటీ పడడం సరికాదని, స్పీకర్ అనేది సభకు సంబంధించిన వ్యవహారం అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు అన్నారు.
—————————–