Kalvakuntla Kavitha on BRS
ఆకేరు న్యూస్, కొత్తగూడెం:
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ముఖ్యురాలు కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) సింగరేణి కార్మికుల పక్షాన చేపట్టిన ‘బాయిబాట’ రెండో విడత పర్యటనలో భాగంగా కొత్తగూడెం వేదికగా విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. తన ఊపిరి ఉన్నంత వరకు మళ్లీ ఆ పార్టీ గడప తొక్కే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
* 1,400 కోట్లు అమరవీరుల కుటుంబాలకు పంచాలి..
అక్రమ మార్గాల్లో బీఆర్ఎస్ ఖాతాలోకి చేరిన రూ.1,400 కోట్ల నిధులను తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పంపిణీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. కేటీఆర్ తన సన్నిహితులకు చెందిన నిర్మాణ సంస్థలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని మండిపడ్డారు. రూ.188 కోట్లతో ఓ ఆంగ్ల పత్రికను కొనుగోలు చేసి, తమ పార్టీకి సంబంధించిన వార్తలు రాకుండా తెరవెనుక రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతికి కారణమైన హరీశ్ రావును ఇంకా వెనకేసుకురావడం చూస్తే.. ఆ పార్టీ భవిష్యత్తు శూన్యమని అర్థమవుతోందన్నారు.
* సోషల్ మీడియాకు వార్నింగ్..
మహిళ అనే విచక్షణ లేకుండా బీఆర్ఎస్ (BRS) సోషల్ మీడియా విభాగం సభ్యత మరిచి పోస్టులు పెడుతోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇది ఆంధ్రప్రదేశ్ కాదు.. కాళ్లు విరగ్గొట్టి చేతిలో పెడతాం” అంటూ ఘాటుగా హెచ్చరించారు. తమ పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక ఈసీకి వెయ్యికి పైగా ఫిర్యాదులు చేశారని విమర్శించారు.
* రైతుల సమస్యలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం..
రాష్ట్రంలో అవినీతి విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని కవిత ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి నీటి పారుదల రంగంపై కనీస అవగాహన లేదని విమర్శించారు. మేడిగడ్డ ఇబ్బందుల్లో ఉన్నా, ప్రత్యామ్నాయంగా రాళ్ల కట్ట నిర్మించి అన్నారం, సుందిళ్ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా రైతులను కక్షపూరితంగా ముంచుతున్నారని ఆరోపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన మహిళలపై, రైతులపై అక్రమ కేసులు, రౌడీ షీట్లు పెట్టడం దారుణమన్నారు.
* సింగరేణి హక్కుల కోసం పోరాటం.. లేదంటే నిరాహార దీక్ష..
ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలు అందకపోవడం వల్లే సింగరేణి ఇబ్బందుల్లో పడిందని కవిత పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్కున్న మిగిలిన 16 బొగ్గు గనులను సింగరేణికే దక్కేలా కిషన్ రెడ్డి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. గతంలో తాము తెచ్చిన డిపెండెంట్ ఉద్యోగాల ప్రక్రియను ఇప్పుడు లంచాలతో పాడు చేస్తున్నారని ఆరోపించారు.
వెంటనే నెలలో రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించి డిపెండెంట్ ఉద్యోగాల సమస్యను పరిష్కరించకపోతే, తాను స్వయంగా నిరాహార దీక్షకు దిగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్మికుల సమస్యలను వదిలేసి, కాంగ్రెస్తో దోస్తీ చేస్తూ సొంత అజెండాతో వెళ్తున్నారని విమర్శించారు.
