Singer S Janaki Passes Away
* 88 ఏళ్ల వయసులో మైసూరులో తుదిశ్వాస..
* నాలుగు జాతీయ అవార్డుల గ్రహీత
ఆకేరు న్యూస్, డెస్క్: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో దిగ్గజ గాయని, దక్షిణ భారత గానకోకిల ఎస్. జానకి (S. Janaki) కన్నుమూశారు.
88 ఏళ్ల వయసులో మైసూరులో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సంగీత ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పల్లపట్లలో జన్మించిన ఎస్. జానకి.. దాదాపు ఆరు దశాబ్దాల పాటు తన మధుర గానంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించిన ఆమెకు నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, 33 రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి.
2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె తిరస్కరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తన సంగీత సేవలకు తగిన గుర్తింపు ఆలస్యంగా వచ్చిందని ఆమె అప్పట్లో పేర్కొన్నారు.
1957లో సినీ గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎస్. జానకి.. 2016లో అధికారికంగా గానానికి వీడ్కోలు పలికారు. అనంతరం 2018లో ఒక తమిళ చిత్రానికి చివరిసారిగా పాట పాడి తన ఆరు దశాబ్దాల సంగీత ప్రయాణాన్ని ముగించారు.
ఎస్. జానకి మరణంపై సినీ, సంగీత ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె గాత్రం భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నివాళులర్పిస్తున్నారు.
