Visakhapatnam Earthquake
* తెల్లవారుజామున ఉలిక్కిపడ్డ జనం
* ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేదు
ఆకేరు న్యూస్, డెస్క్:
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో ఆదివారం తెల్లవారుజామున భూమి కంపించింది. ఉదయం 5:08 గంటలకు సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో నమోదైంది.
ఒక్కసారిగా భూమి కంపించడంతో నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
* బంగాళాఖాతంలో భూకంప కేంద్రం
అధికారుల సమాచారం ప్రకారం, కాకినాడకు సుమారు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
గాజువాక, మాధవధార, పెదవాల్తేరు, సీతమ్మధార, హెచ్‌బీ కాలనీ, తాటిచెట్లపాలెం, ఈస్ట్ పాయింట్ కాలనీ తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు స్పష్టంగా అనుభూతి చెందాయి.
* అప్రమత్తమైన అధికారులు
భూకంపం అనంతరం అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని వెల్లడించారు. విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది.
* సునామీ ముప్పు ?
భూకంపం సముద్రంలో సంభవించినప్పటికీ, ప్రస్తుతం సునామీ ముప్పు లేదని అధికారులు ప్రాథమికంగా పేర్కొన్నారు. అయినప్పటికీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
* వరుస భూకంపాలతో ఆందోళన
ఇటీవలి కాలంలో ప్రపంచంలోని పలు దేశాల్లో వరుసగా భూకంపాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే విశాఖలో నమోదైన ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.
