Delhi Constable Wife Murder
* బర్త్‌డే రోజే భార్యను చంపిన భర్త
* కట్నం వేధింపులే ప్రాణం తీశాయా
* కాపాడటానికి ప్రయత్నించిన డెలివరీ బాయ్
ఆకేరు న్యూస్, డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ఘోరమైన ఉదంతం వెలుగుచూసింది. రక్షణ కల్పించాల్సిన ఒక పోలీస్ అధికారే కిరాతకుడిగా మారాడు. కట్టుకున్న భార్య పుట్టినరోజు నాడే, అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపి పరారయ్యాడు. ఢిల్లీలోని వినోద్ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఢిల్లీ పోలీసు విభాగంలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్ (AATS) లో మనీష్ భాటి అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి 2023లో ప్రియాంక అనే మహిళతో వివాహమైంది. కాగా, ప్రియాంక పుట్టినరోజు కావడంతో దంపతులిద్దరూ కలిసి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో బైక్‌పై బయటకు వెళ్లారు.
అయితే, మార్గమధ్యంలో లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రి సమీపంలోకి రాగానే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దది కావడంతో ప్రియాంక కోపంతో బైక్ దిగి నడుచుకుంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మనీష్, తన వద్ద ఉన్న తుపాకీని తీసి ప్రియాంకపై కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. మనీష్ బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు.
* కాపాడటానికి ప్రయత్నించిన డెలివరీ బాయ్..
తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న ప్రియాంకను ఆ మార్గంలో వెళ్తున్న ఒక డెలివరీ బాయ్ గమనించాడు. మానవత్వంతో స్పందించిన అతను వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, వారు ఇద్దరూ ఇంటి నుంచి బయల్దేరడానికి ముందు కూడా గదిలో గొడవ పడ్డారని స్థానికులు చెబుతున్నారు.
* వెలుగులోకి వచ్చిన కట్నం వేధింపులు..
మనీష్ గత కొంతకాలంగా ప్రియాంకను అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక 2024లో ప్రియాంక సుమారు 8 నెలల పాటు తన సోదరుడి ఇంట్లోనే ఆశ్రయం పొందిందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. చివరకు పుట్టినరోజు నాడే ఆమెను ప్లాన్ ప్రకారం పిలుచుకెళ్లి పొట్టనబెట్టుకున్నాడని బాధితురాలి బంధువులు వాపోతున్నారు.
* కేసు నమోదు.. నిందితుడి కోసం గాలింపు..
ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడైన కానిస్టేబుల్ మనీష్ భాటిపై హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒక పోలీస్ అధికారే ఈ తరహా కిరాతకానికి ఒడిగట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
