Warangal Airport Development Telangana
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలో పారిశ్రామిక, రవాణా రంగాల అభివృద్ధికి ఊతమిచ్చేలా వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పౌర విమానయాన శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రెండు కీలక విమానాశ్రయాల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు.
* ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా వరంగల్…
ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వరంగల్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానమై ఉన్న వరంగల్ నగరం.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వంటి పరిశ్రమలతో రాబోయే రోజుల్లో మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు.
* 2028 జూన్ 2 నాటికి ప్రారంభోత్సవం…
వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున, తక్షణమే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం కోరారు. తెలంగాణ అవతరణ దినోత్సవమైన 2028, జూన్ 2 నాటికి పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇక్కడ MRO (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్), ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులతో పాటు విమాన శిక్షణ సంస్థ (FTO)ను ఏర్పాటు చేయాలన్నారు.
* కాకతీయ సంస్కృతి ప్రతిబింబించేలా డిజైన్లు
వరంగల్ నగరానికి ఉన్న ఘనమైన చరిత్రను చాటిచెప్పేలా.. ఎయిర్పోర్ట్ డిజైన్లు కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, సంస్కృతిని అద్దం పట్టేలా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. దీనికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు.
* ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ & సీప్లేన్ ప్రతిపాదనలు
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్: ఇక్కడ రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్‌పోర్టుతో పాటు పౌర విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలని, దీనికి అవసరమైన భూమిని సేకరించి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక్కడ కూడా MRO, ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులు, విమాన శిక్షణ సంస్థ (FTO)ను నెలకొల్పాలని కోరారు.
హైదరాబాద్ టూ విజయవాడ సీప్లేన్: హుస్సేన్ సాగర్ నుండి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి సీప్లేన్లు నడిపే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ సూచించగా.. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి, వెంటనే అవసరమైన అధికారిక ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు.
* భూసేకరణపై కేంద్ర మంత్రి ప్రశంసలు
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేసి చరిత్ర సృష్టించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. త్వరగా స్పందించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
* రాజకీయాలు ఎన్నికల వరకే…
“అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయాలను ఎన్నికల సమయానికే పరిమితం చేయాలి. కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో రాష్ట్రానికి సహకరిస్తోంది. ఎక్కడైనా సమస్యలు లేదా సమాచార లోపం ఉంటే కేంద్ర మంత్రులను కలిసి చర్చల ద్వారా పరిష్కరించుకుంటున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు మరియు పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
