GWMC Commissioner Venkanna, Safai Mitra Welfare
* పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే జీడబ్ల్యూఎంసీ ధ్యేయం
* నమస్తే దినోత్సవం సందర్భంగా సఫాయి మిత్రలకు పీపీఈ కిట్లు, ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ
అకేరు న్యూస్, వరంగల్ :గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో “నమస్తే దినోత్సవం” సందర్భంగా మంగళవారం జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై నగర పారిశుద్ధ్య నిర్వహణలో విశేష సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సఫాయి మిత్రలను అభినందించారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, సఫాయి మిత్రలకు విధుల నిర్వహణలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, వ్యక్తిగత రక్షణ పరికరాల (PPE) వినియోగం, వ్యర్థాల సురక్షిత నిర్వహణ, ఆరోగ్య పరిరక్షణ, ప్రమాదాల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
భద్రతా పరికరాలను తప్పనిసరిగా వినియోగించడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అధికారులు వివరించారు.
అనంతరం కమిషనర్ టి. వెంకన్న 60 మంది సఫాయి మిత్రలకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (PPE) కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో భద్రతా గ్లౌజులు, మాస్కులు, రిఫ్లెక్టివ్ జాకెట్లు, గమ్బూట్లు తదితర రక్షణ పరికరాలు ఉన్నాయి. విధుల నిర్వహణ సమయంలో ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు ఈ రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని కమిషనర్ సూచించారు.
అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద అర్హులైన సఫాయి మిత్రలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలను పొందే అవకాశం కల్పించబడుతుందని వివరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ, నగర పరిశుభ్రతను పరిరక్షించడంలో పారిశుద్ధ్య కార్మికులు, సఫాయి మిత్రల పాత్ర అత్యంత కీలకమైందని కొనియాడారు. వారి శ్రమతోనే నగరం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వారి ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి జీడబ్ల్యూఎంసీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విధుల నిర్వహణలో భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ వ్యక్తిగత రక్షణ పరికరాలను ఎల్లప్పుడూ వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, ప్రజారోగ్య విభాగ అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, సఫాయి మిత్రలు పాల్గొన్నారు.
