Telangana Tenant Farmers Recognition
* కౌలు రైతుల గుర్తింపు కాలగర్భంలో కలిసినట్లేనా..
ఆకేరు న్యూస్,హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కౌలు రైతుల (tenant farmers) బతుకులు మారుతాయని లక్షలాది మంది ఆశించారు. కానీ, స్వరాష్ట్రంలో వారి పరిస్థితి ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు’ తయారైంది. రాష్ట్రం సిద్ధించి 12 సంవత్సరాలు దాటినా.. వ్యవసాయ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కౌలు రైతులకు అధికారిక గుర్తింపు కరువు కావడం విచారకరం.
భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులు లేకపోయినా, రేయింబవళ్లు కష్టపడి దేశానికి అన్నం పెడుతున్నది కౌలు రైతులేనని నీతి ఆయోగ్ సైతం పేర్కొంది. క్షేత్రస్థాయిలో వీరు భూ యజమానులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారుల చేతిలో బహుముఖ దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వాలు కనీస మద్దతు ధర (MSP) కల్పించకపోవడం కౌలు రైతులను మరింత కుంగదీస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉంటే, వారిలో దాదాపు 25 లక్షల మంది (35 శాతం కంటే ఎక్కువ) కౌలు రైతులే ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న సాగుదారులను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
2015లో జీవో నెం. 282 ద్వారా ప్రక్రియ ప్రారంభించినా.. కేవలం 43,500 మందికే కార్డులు ఇచ్చి, అందులో 8 వేల మందికే పంట రుణాలు అందించి చేతులు దులుపుకున్నారు.
కౌలుదారుల హక్కుల కోసం 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్–2011’ను తెచ్చింది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు లోన్ ఎలిజిబిలిటీ కార్డులు (LEC) జారీ చేసి పంట రుణాలు, పంట బీమా, నష్టపరిహారం, ప్రభుత్వ సబ్సిడీలు కల్పించాలి. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో 5 లక్షల మందికి, 2013లో 3.90 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చి వందల కోట్ల రుణాలు అందించారు.
చట్టం ప్రకారం ప్రతి ఏటా మే నెలలో, ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే గ్రామసభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించాలి. భూ యజమాని అనుమతితో నిమిత్తం లేకుండా కార్డులు ఇవ్వాలని చట్టం చెబుతున్నా.. నేడు అధికారులు యజమానుల అభ్యంతరాలను సాకుగా చూపి దరఖాస్తులను నిర్లక్ష్యం చేస్తున్నారు.
గత పాలకుల వైఫల్యాలను ఎండగట్టి, అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కౌలు రైతుల విషయంలో నిరాశాజనక వైఖరినే అవలంబిస్తోంది. ‘ప్రజా పాలన’ అని చెప్పుకుంటున్న ఈ తరుణంలోనూ వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు ‘రైతు భరోసా’, ‘రైతు బీమా’ వర్తించకపోవడం అత్యంత విచారకరం.
పెట్టుబడి ఖర్చులు పెరగడం, కౌలు రేట్లు ఆకాశాన్ని అంటడంతో కౌలు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి, అర్హులైన కౌలు రైతులకు LEC కార్డులు, పంట రుణాలు, బీమా సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవడం అత్యవసరం. సమాచారం కోసం పెద్దారపు రమేష్ (Pedharapu Ramesh), ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెల్: 8500313310, 9381375276.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
