Bhadrakali Festival Schedule 2026
ఆకేరు న్యూస్, వరంగల్: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వరంగల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఆషాఢ శుద్ధ పాడ్యమి (జులై 15) నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి (జులై 29) వరకు పక్షం రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఉదయం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. తొలి రోజున వేదమంత్రాల నడుమ సహస్ర కలశాభిషేకాలు, గణపతి పూజ, పూర్వాంగవిధి కార్యక్రమాలతో ఉత్సవాలు శాస్త్రోక్తంగా మొదలయ్యాయి.
* 500 ఏళ్ల చరిత్ర.. దేశంలోనే మొట్టమొదటి ఆలయం..
దేశంలోనే మొట్టమొదటి శాకాంబరీ ఉత్సవం ప్రారంభమయ్యేది వరంగల్ భద్రకాళి ఆలయంలోనేనని ఇక్కడి అర్చకులు చెబుతారు. ఇక్కడ వేడుకలు మొదలైన తర్వాతే దేశంలోని మిగిలిన ప్రాంతాలలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి సుమారు 450 నుంచి 500 ఏళ్ల నాటి చారిత్రాత్మక నేపథ్యం ఉంది. పూర్వం దేశంలో తీవ్రమైన కరవు వచ్చి, వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు. ఆ సమయంలో కరవు కాటకాలు తొలగిపోయి, సమృద్ధిగా వర్షాలు కురవాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఈ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ వేడుకలను జరపడం ఆనవాయితీగా వస్తోంది.
* రోజువారీ పూజా క్రమం – పూర్తి షెడ్యూల్…
ఈ 14 రోజుల పాటు నిత్య క్రమంలో భాగంగా అమ్మవారు రోజుకో విశిష్ట రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
జులై 15- ఉదయం కామేశ్వరి క్రమంలో పూజలు.
జులై 16- కపాలినీ క్రమం, భగమాలినీ క్రమం.
జులై 17- కుల్లా క్రమం, నిత్యక్లిన్నా క్రమం.
జులై 18- కురుకుల్లా క్రమం, భేరుండా క్రమం.
జులై 19- విరోధినీ క్రమం, వహ్నివాసినీ క్రమం.
జులై 20- విప్రచిత్తా క్రమం, మహావజ్రేశ్వరీ క్రమం.
జులై 21- ఉగ్రా క్రమం, శివదూతీ క్రమం.
జులై 22- ఉగ్రప్రభా క్రమం, త్వరితా క్రమం.
జులై 23- దీప్తా క్రమం, కులసుందరీ క్రమం.
జులై 24- నీలా క్రమం, విజయా క్రమం.
జులై 25- ఘనా క్రమం, నీలపతాకా క్రమం.
జులై 26- బలాకా క్రమం, విచిత్రా క్రమం.
జులై 27- మాత్రా క్రమం, సర్వమంగళా క్రమం.
జులై 28- ముద్రా క్రమం, జ్వాలామాలినీ క్రమం.
జులై 29 (పౌర్ణమి)- మితా క్రమం.
చివరి రోజున ‘సంపూర్ణ శాకాంబరీ’ అలంకరణ.
ఈ మహోత్సవాలన్నింటిలోకెల్లా చివరి రోజైన జులై 29 (ఆషాఢ శుద్ధ పౌర్ణమి) నాడు జరిగే అలంకరణ అత్యంత అద్భుతమైనది. ఆ రోజు అమ్మవారు భక్తులకు ‘సంపూర్ణ శాకాంబరీ’గా దర్శనమిస్తారు. అమ్మవారిని పూర్తిగా ప్రకృతిలో లభించే రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో నయనానందకరంగా అలంకరిస్తారు. ఆ సమయంలో శాకాంబరీ దేవిని దర్శించుకుంటే కరువు కాటకాలు దరిచేరవని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
* భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు…
ఈ ఉత్సవాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు విస్తృతమైన క్యూలైన్లు, తాగునీరు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
