Hyderabad Madapur Murder Case near Rameshwaram cafe
* రామేశ్వరం కేఫ్ ఎదుట మర్డర్
* అమ్మాయిలను వేదిస్తున్నందుకే..
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
హైదరాబాద్ లో దారుణం జరిగింది.
నగరంలోని ఐటీ హబ్ మాదాపూర్ ( Madapur ) ప్రాంతంలో, ప్రముఖ రామేశ్వరం కేఫ్ ఎదుట, ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. అమ్మాయిలను వేధించడమే ఈ దారుణ హత్యకు కారణమని తెలుస్తోంది.
* సవాల్ విసిరిన యువకుడు..
హత్యకు గురైన యువకుడిని భాస్కర్ ( Bhaskar ) (26) గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. భాస్కర్ కొంతకాలంగా ఇద్దరు యువతులను వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులపై గతంలోనే బాధిత యువతుల కుటుంబ సభ్యులు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు భాస్కర్‌కు, బాధితులకు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చి, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ, భాస్కర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని పోలీసులు తెలిపారు.ఈ మధ్యకాలంలో భాస్కర్ సదరు యువతుల తండ్రికి ఒక సవాల్ విసిరాడు. “ధమ్ముంటే హైదరాబాద్‌కు రండి” అంటూ భాస్కర్ రెచ్చగొట్టడంతో, యువతుల తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో, తండ్రి మరొక వ్యక్తితో కలిసి పథకం ప్రకారం వరంగల్ నుండి హైదరాబాద్‌కు వచ్చారు. మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్ ( Rameshwaram Cafe )వద్ద భాస్కర్‌ను అడ్డగించి, కత్తులు మరియు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో భాస్కర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో మాదాపూర్ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
హత్య జరిగిన వెంటనే నిందితులు ఇద్దరూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయారు. ఈ లోపు, స్థానికులు డయల్-100కు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుని, క్లూస్ టీమ్‌ను రప్పించి కీలక ఆధారాలను సేకరించారు. భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ హత్యకు ప్రేమ వేధింపుల వివాదం మాత్రమే కారణమా? ఇతర కారణాలు కూడా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
———
