Sonam Wangchuk Hunger Strike
ఆకేరు న్యూస్, డెస్క్: దేశంలో ప్రవేశ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస లోపాలు, అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష తీవ్ర రూపం దాల్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత రెండు వారాలకు పైగా సాగుతున్న ఈ ఆమరణ నిరాహార దీక్ష నేటితో 20వ రోజుకు చేరుకుంది. పరీక్షల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పట్టుబడుతున్నారు.
ఈ సందర్భంగా సోనమ్ వాంగ్చుక్ మాట్లాడుతూ.. “మన దేశ యువత భవిష్యత్తును కాపాడేందుకు, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని తీసుకువచ్చేందుకు నా ప్రాణాలనైనా అర్పిస్తాను.
అవసరమైతే ఆత్మగానైనా తిరిగి వచ్చి ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను” అని భావోద్వేగ ప్రకటన చేశారు.
దీక్ష సుదీర్ఘంగా సాగుతుండడంతో వాంగ్చుక్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఆయన శారీరక పరిస్థితిపై దేశవ్యాప్తంగా పలువురు మేధావులు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యావ్యవస్థలో పారదర్శకతను పెంచేలా తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
