Palakurthi Temple Kalyana Mandapam
ఆకేరు న్యూస్,పాలకుర్తి: మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో నిర్మించనున్న కళ్యాణ మండపం కోసం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి శనివారం స్థల పరిశీలన నిర్వహించారు.
దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కళ్యాణ మండపం నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించి, నిర్మాణానికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా విశాలమైన, ఆధునిక సౌకర్యాలతో కళ్యాణ మండపాన్ని నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ప్రాంత ప్రజలకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రమని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
కళ్యాణ మండపం నిర్మాణం పూర్తయిన అనంతరం ఆలయంలో జరిగే వివాహాలు, ధార్మిక కార్యక్రమాలు, ఇతర ఆధ్యాత్మిక వేడుకలను మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునే అవకాశం భక్తులకు లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
