School Bus Safety Rules
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సురక్షిత ప్రయాణమే అత్యంత ప్రాధాన్యమని, బస్సు డ్రైవర్లు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీవో) బాధావత్ శంకర్ స్పష్టం చేశారు.
మహబూబాబాద్ పట్టణంలోని వీఆర్ఎన్ గార్డెన్లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, బస్సు డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లకు డిఫెన్సివ్ డ్రైవింగ్ మెళకువలు, అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణ అందించే సీపీఆర్ (CPR) విధానం, ప్రథమ చికిత్స అంశాలపై నిపుణులు ప్రత్యక్ష అవగాహన కల్పించారు.
* అనుభవజ్ఞులైన డ్రైవర్లనే నియమించాలి..
ఈ సందర్భంగా డీటీవో బాధావత్ శంకర్ మాట్లాడుతూ.. పాఠశాల యాజమాన్యాలు డ్రైవర్లను ఎంపిక చేసుకునేటప్పుడు సరైన అనుభవం, సరైన లైసెన్స్ ఉన్నవారిని మాత్రమే నియమించుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో అతివేగం (Over Speeding), సెల్ఫోన్ మాట్లాడటం (Mobile Driving), మద్యం సేవించి వాహనం నడపడం (Drink and Drive) వంటి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే డ్రైవర్లపైనే కాకుండా, సంబంధిత పాఠశాల యాజమాన్యాలపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* రాత్రి వేళ ప్రమాదాల నివారణకు చర్యలు..
మబ్బు వాతావరణంలో, వర్షంలో మరియు రాత్రి వేళల్లో రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు స్కూల్ బస్సులకు తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లను అమర్చాలని అధికారులకు, యాజమాన్యాలకు ఆదేశించారు. వాహనాలకు నిబంధనల ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికెట్ (FC), ఇన్సూరెన్స్ మరియు ఇతర పత్రాలు సక్రమంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ అవగాహన కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) అరుణ్ కుమార్, పలు ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, బస్సు డ్రైవర్లు మరియు రవాణా శాఖ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
