Nellikuduru Power Cuts Protest
* రాత్రివేళ చీకట్లో గ్రామాలు…
* రోడ్డెక్కిన మునిగలవేడు ప్రజలు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ తలకిందులైంది. రాత్రి వేళల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తరచూ విద్యుత్ నిలిపివేస్తుండటంతో నెల్లికుదురు మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. రాత్రివేళ కరెంట్ కోతలతో ఉక్కపోత, దోమల కాటుతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మునిగలవేడు గ్రామానికి చెందిన ప్రజలు శనివారం రాత్రి నిరసన బాట పట్టారు.
మునిగలవేడు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం మేయిన్ రోడ్డుపై కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. దీంతో ప్రధాన రహదారిపై కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి.
* అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం..
రాత్రి వేళల్లో కరెంట్ కట్ చేయడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారు కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వం ఊదరగొట్టే ప్రకటనలకే పరిమితమవుతోందని, “అరకోతల్లేని ఉచిత విద్యుత్” అని చెప్పడమే తప్ప ఆచరణలో అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
తక్షణమే రాత్రి వేళల్లో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
