* కేన్సర్ కారకాలను గుర్తించిన అధ్యయనం
* కర్ణాటకలో పానీపూరీ నిషేధించే యోచన?
* హైదరాబాద్లో తనిఖీలకు సిద్ధమవుతున్న అధికారులు!
ఆకేరు న్యూస్ డెస్క్ : పానీపూరీ.. ఆ పేరు వింటేనే కొందరికి నోరూరుతుంది. తినాలనే కోరిక కలుగుతుంది. తెలియకుండానే కాళ్లు పానీపూరీ బండివైపు అడుగులు వేస్తాయి. కానీ.. తినే ముందు ఒక్కసారి ఆగండి. నిర్వాహకుల శుభ్రత.. నాణ్యతా ప్రమాణాలు అటుంచితే.. పానీపూరీలో కేన్సర్ కారకాలు ఉన్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. పానీపూరీ తయారీలో వినియోగించే రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలను గుర్తించినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆ సంస్థ ఇటీవల చేసిన పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు వివరించింది. ఈనేపథ్యంలో కర్నాటకలో ఆహార భద్రత విభాగం అధికారులు రాజధాని బెంగళూరుతోపాటు 79 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా పానీపూరీ టెస్టుల్లో వాటి సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. చాలా వరకూ శాంపిళ్లలో సన్ సెట్ యెల్లో , బ్రిలియంట్ బ్లూ, కార్మోసిన్ రంగులు ఉన్నట్లు తేలిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
నిషేదిద్దామా?
బెంగళూరులో సేకరించిన 49కి 19 శాంపిళ్లలో సింథటిక్ కలర్స్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పానీపూరీ తయారీలో కృత్రిమ రంగులతో తయారు చేసే సాస్ లు, స్వీట్ చిల్లీ పౌడర్లను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇటీవల గోబీ మంచూరియా, కబాబ్ ల వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్నాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. పానీపూరీ ప్రియులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్లో కూడా అధికారులు తనిఖీలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ లో తనిఖీలు కొనసాగిస్తున్న ఫుడ్సేఫ్టీ అధికారులు తాజా అధ్యయనాల నేపథ్యంలో పానీపూరీ తయారీలో నాణ్యతను పరిశీలించనున్నారు.
—————–