Kaunik Vardhan Sailing Championship
*తెలంగాణ నేల గర్వించేలా..
* అంతర్జాతీయ వేదికపై గురుకుల కెరటం!
– ఇటలీ సెయిలింగ్ ఛాంపియన్షిప్కు ఎంపికైన కమలాపూర్ సంచలనం దేవరాజు కౌనిక్ వర్ధన్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
తెలంగాణ మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల నుంచి మరొక అద్భుత రత్నం అంతర్జాతీయ వేదికపై మెరవడానికి సిద్ధమైంది. వివరాల్లోకి వెళ్తే హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వంగపల్లి గ్రామానికి చెందిన దేవరాజు కౌనిక్ వర్ధన్ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహించే అత్యంత అరుదైన అవకాశాన్ని కైవసం చేసుకున్నాడు.
ప్రతిష్టాత్మక 2026 ఇంటర్నేషనల్ క్యాడెట్ వరల్డ్ ఛాంపియన్షిప్ (పడవ పందెం పోటీలు)లో భాగంగా, ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (YCH),ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ సొసైటీల భాగస్వామ్యంతో కౌనిక్ వర్ధన్ మన దేశం తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ అంతర్జాతీయ స్థాయి పోరు ఇటలీలోని టోర్బోల్ సుల్ గార్డ వేదికగా జూలై 30 నుండి ఆగస్టు 7 వరకు జరగనుంది.
* నీటి అలలపై కౌనిక్ వర్ధన్ పట్టుదల ప్రయాణం
పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తాడూరి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం… 2023-24 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదువుతున్న సమయంలో సమ్మర్ క్యాంప్ ద్వారా సెయిలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన కౌనిక్, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. 2024 సికింద్రాబాద్ 16వ యాచ్ మాన్సన్ రెగట్టాలో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. 2025లో మేఘాలయలోని షిల్లాంగ్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.2026 4వ YAI నార్త్ ఈస్ట్ రెగట్టా తో పాటు, ముంబైలో జరిగిన పోటీల్లో చూపిన అసాధారణ నైపుణ్యంతో గోవాలోని నేవీ స్పోర్ట్స్ స్కూల్, బెంగళూరులోని మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ (MEG) ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ’ లలో ప్రవేశానికి ఎంపికై తన సత్తా చాటాడు.
* ఆల్ ది బెస్ట్ కౌనిక్ వర్ధన్
కౌనిక్ వర్ధన్ చూపిన క్రమశిక్షణ, అంకితభావం, అసాధారణ నైపుణ్యాలే అతడిని ఈ శిఖరానికి చేర్చాయని ప్రిన్సిపాల్ డాక్టర్ తాడూరి రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్న ఈ గ్రామీణ ప్రాంత క్రీడా కిశోరానికి గురుకుల సొసైటీ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, మండల ప్రజలు, క్రీడాభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, ఇటలీలో విజయం సాధించి దేశానికి స్వర్ణం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
