Collector Chahat Bajpai Alternative Crop Farming
* ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి
* ఐనవోలు మండలంలో పెసర, ఆయిల్‌పామ్, మామిడి తోటలను పరిశీలించిన కలెక్టర్
అకేరు న్యూస్, హనుమకొండ: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు తక్కువ నీటి అవసరమయ్యే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు.
ఐనవోలు మండలం సింగారం, పున్నేలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్, రైతులు సాగు చేస్తున్న పెసర, ఆయిల్‌పామ్ పంటలతో పాటు మామిడి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సింగారం గ్రామానికి చెందిన రైతు ఆకారపు పురుషోత్తం రెడ్డి మూడు ఎకరాల్లో ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి వినియోగంతో పెసర పంటను సాగు చేయడాన్ని కలెక్టర్ అభినందించారు. అనంతరం రైతులతో మాట్లాడి ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులుగా ఏయే పంటలు అనుకూలంగా ఉంటాయో తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పెసర, మినుములు, కందులు వంటి పంటలకు తక్కువ నీరు అవసరమవుతుందని, 60–70 రోజుల్లో దిగుబడి రావడంతో పాటు మార్కెట్లో మంచి ధర కూడా లభిస్తోందని తెలిపారు. ఈ పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నట్లు కలెక్టర్‌కు వివరించారు.
అనంతరం పున్నేలు గ్రామంలో రైతు వేల్పుల రమేష్ ఆరున్నర ఎకరాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటను కలెక్టర్ పరిశీలించారు. పంట సాగు కాలం, దిగుబడి, ఆదాయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన రైతు రాజారపు బాలరాజు కూడా ఆయిల్‌పామ్ మొక్కలు నాటినట్లు కలెక్టర్‌కు తెలిపారు.
అలాగే రైతు రవికిరణ్ రెడ్డి మూడు ఎకరాల్లో సాగు చేస్తున్న మామిడి తోటను సందర్శించి తోట నిర్వహణ, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో వరి, పత్తి, మొక్కజొన్న వంటి అధిక నీటి అవసరమయ్యే పంటల కంటే పెసర, మినుములు, కందులు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, పచ్చజొన్న వంటి ఆరుతడి పంటలు రైతులకు మరింత ప్రయోజనకరమని పేర్కొన్నారు.
అలాగే ఆయిల్‌పామ్ దీర్ఘకాలికంగా రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే లాభదాయక పంట అని, అనుకూల ప్రాంతాల్లో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటికే పెసర, ఆయిల్‌పామ్ సాగు ద్వారా ఆదర్శంగా నిలుస్తున్న రైతులను అభినందిస్తూ, ఇతర రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం కూడా పెసర, మినుములు, కందుల విత్తనాలను సబ్సిడీపై అందించే దిశగా చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో వ్యవసాయ శాఖ ఏడీ ఆదిరెడ్డి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
