Minister Sridhar Babu, CURE Bill 2026
* మహానగర రూపురేఖలు మారేలా చారిత్రాత్మక చట్టం
* 70 ఏళ్ల నాటి చట్టానికి గుడ్ బై
* రూ. 1.50 లక్షల కోట్ల భూముల రక్షణే లక్ష్యం
* హైదరాబాద్ భవిష్యత్తు కోసం బిగ్ ప్లాన్
* అసెంబ్లీలో బిల్లులోని అంశాలను వెల్లడించిన మంత్రి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అత్యంత కీలకమైన “క్యూర్ (CURE – Core Urban Region Economy) బిల్లు – 2026″ను శుక్రవారం ప్రవేశపెట్టారు. 70 ఏళ్ల నాటి పాత జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో, నగర రాబోయే 20-30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమగ్ర వికేంద్రీకృత చట్టాన్ని రూపొందించినట్లు ఆయన సభకు వెల్లడించారు. బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
* ఏకీకృత పాలన.. 2,053 చ.కీ కు విస్తరణ..
హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యూనిఫాం గవర్నెన్స్, ప్రామాణిక పద్ధతులు (Standardized practices) అందించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని పాత మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, పరిసర ప్రాంతాలను కలుపుతూ CURE పరిధిని సుమారు 2,053 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించారు.
* మూడు కార్పొరేషన్లుగా వికేంద్రీకరణ..
సమర్థవంతమైన పాలన కోసం ప్రస్తుత జీహెచ్ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి) విభజించి వికేంద్రీకరిస్తున్నారు. పౌర సేవల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా “CURE అపీల్ అథారిటీ”ని, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఉన్నత పాలన మండలిని ఏర్పాటు చేయనున్నారు.
* తెలంగాణ రైజింగ్ 2047 విజన్..
400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్‌గా మారింది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ GSDP 10.7% వృద్ధితో ₹17.82 లక్షల కోట్లకు చేరగా, అందులో సేవా రంగం వాటా 68.6%గా ఉంది.
* భారీ మెట్రో విస్తరణ.. తాగునీటి ప్రాజెక్టులు
మెట్రో రైల్: 2030 నాటికి 258.4 కిలోమీటర్లు, 2050 నాటికి 556.6 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండవ దశలో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపట్టనున్నారు.
తాగునీటి ప్రాజెక్టులు : రూ. 7,360 కోట్లతో గోదావరి 2, 3 దశల ద్వారా నగరానికి 20 టీఎంసీల తాగునీటిని అందించే పనులు పురోగతిలో ఉన్నాయి.
మౌలిక వసతులు : హెచ్సిటిఐ (HCTI) కింద రూ. 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వేగవంతం చేశారు.
* హైడ్రా ద్వారా రూ. 1.50 లక్షల కోట్ల ఆస్తుల రక్షణ..
చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా గత రెండేళ్లలో హైడ్రా ద్వారా రూ. 1.50 లక్షల కోట్ల విలువైన 3,325 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 3D డిజిటల్ మ్యాపింగ్ & సింగిల్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ (CURE-1), లీడార్ (LiDAR) సర్వే ద్వారా నగర భవనాలు, రోడ్లు, చెరువులు, నాళాలను 3D డిజిటల్ మ్యాపింగ్ చేస్తున్నారు. పౌరుల సౌకర్యార్థం ఆస్తిపన్ను, వాటర్, కరెంట్ బిల్లులు, ట్రేడ్ లైసెన్సులు, ట్రాఫిక్ చలాన్లను ఒకే చోట చెల్లించేలా ‘CURE-1’ అనే సింగిల్ డిజిటల్ వేదికను అందుబాటులోకి తెస్తున్నారు.
* 1955 నాటి పాత చట్టం రద్దు..
1955లో జీహెచ్ఎంసీ చట్టం తెచ్చినప్పుడు హైదరాబాద్ జనాభా కేవలం 15 లక్షలు మాత్రమే కాగా, ప్రస్తుతం జనాభా 1.30 కోట్లకు పైగా పెరిగింది. పాత చట్టంలో గుర్రాలు, ఎద్దుల బండ్లపై పన్నులు వంటి నేటి కాలానికి సరిపోని నిబంధనలు ఉన్నాయి. ఆధునిక మెట్రో సేవలు, ఈ-వేస్ట్, డిజిటల్ పాలన వంటి అంశాలను పొందుపరుస్తూ 40% పైగా మార్పులతో కొత్త చట్టాన్ని తెచ్చారు. పాత చట్టంలో 687 సెక్షన్లు ఉండగా, కొత్త క్యూఆర్ బిల్లును 5 భాగాలు, 43 అధ్యాయాలు, 319 సెక్షన్లు, 9 షెడ్యూళ్లతో అత్యంత సరళంగా రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
