Raja Singh Urban Region Bill
* ఎమ్మెల్యే లేఖలకే స్పందన లేదు..
* గ్లోబల్ సిటీ ఎలా అవుతుందని నిలదీసిన రాజాసింగ్
* కోర్ అర్బన్ రీజియన్ బిల్లుపై కీలక సూచనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో “కోర్ అర్బన్ రీజియన్ 2.06” బిల్లుపై గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ మాట్లాడారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా, మోడల్ అర్బన్ రీజియన్‌గా అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనను స్వాగతిస్తూనే, నగరంలో క్షేత్రస్థాయిలో ఉన్న పలు కీలక సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు.
* ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాలి..
నగరాన్ని అభివృద్ధి చేయాలంటే స్థానిక ఎమ్మెల్యేల భాగస్వామ్యం అత్యంత కీలకమని రాజాసింగ్ స్పష్టం చేశారు. “ఏ నియోజకవర్గంలో, ఏ డివిజన్లో లేదా గల్లీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో స్థానిక ఎమ్మెల్యేలకే స్పష్టత ఉంటుంది. గతంలో కూడా అప్పటి ప్రభుత్వానికి ఈ సూచన చేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్యేలతో ప్రత్యేక కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసి, ఫేజ్-1, ఫేజ్-2 వారీగా నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందించాలి” అని కోరారు.
* నగరంలో మౌలిక వసతుల లేమి..
నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలను రాజాసింగ్ ఎత్తిచూపారు :
మంచినీరు & డ్రైనేజీ : బస్తీల్లో రోజుకు గంట మాత్రమే నీరు వస్తుందని, అందులోనూ మొదటి అరగంట కలుషిత నీరు సరఫరా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన 24 గంటల మంచినీటి హామీ నెరవేరలేదని, ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
హైరైజ్ బిల్డింగ్‌ల అనుమతులు : రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా సామర్థ్యాన్ని పరిశీలించకుండానే బహుళ అంతస్తుల భవనాలకు (హైరైజ్ బిల్డింగ్లు) అనుమతులు ఇస్తున్నారని, దీనివల్ల ట్రాఫిక్, డ్రైనేజీ ఓవర్‌ఫ్లో సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు.
రోడ్లు.. దోమల నివారణ : దాదాపు అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, మూసి పరిసర ప్రాంతాల్లో 20 కిలోమీటర్ల మేర దోమల ఉధృతి తీవ్రంగా ఉందన్నారు. ఫాగింగ్‌లో వాడే కెమికల్స్ నాణ్యతలేమి వల్ల దోమల సమస్య తగ్గడం లేదని విమర్శించారు.
ప్రాపర్టీ టాక్స్ పెంపు : 20% ప్రాపర్టీ టాక్స్ పెంచడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
* అధికారులు – ఎమ్మెల్యేల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్..
ప్రభుత్వ అధికారుల తీరుపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఫుట్‌పాత్‌ల కబ్జాలు, నాలాల ఆక్రమణలు, రోడ్ల వెడల్పు వంటి సమస్యలపై అధికారులకు ఎన్ని లేఖలు రాసినా స్పందన ఉండటం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం అధికారుల తీరుపై అసంతృప్తితో ఉన్నారు. కనీసం ఎమ్మెల్యే రాసిన లేఖకు విచారణ జరిపి సమాధానం ఇచ్చే సంస్కృతి అధికారుల్లో ఉండాలి. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోతే గ్లోబల్ సిటీ కలగా మిగిలిపోతుంది” అని హెచ్చరించారు.
* 100శాతం సహకారం అందిస్తాం..
అభివృద్ధి పనులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్‌గా జరగాలని, అభివృద్ధి పనుల వేగం పెంచాలని కోరారు. హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా తమ నుంచి 100 శాతం సహకారం ఉంటుందని రాజాసింగ్ హామీ ఇచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
