* పెళ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడితే పదేళ్ల జైలు
* పోలీస్స్టేషన్లకు వెళ్లకుండానే ఆన్లైన్ లో ఫిర్యాదులు
* ఎవరు.. ఎక్కడి నుంచైనా జీరో ఫిర్యాదు
* నిర్దిష్ట సమయంలోగా క్రిమినల్ కేసుల తీర్పు
* నేటి నుంచి అమల్లోకి కొత్త చట్టాలు
* బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేశాం : అమిత్ షా
* ప్రజల స్వేచ్ఛను హరించేలా ఈ చట్టాలు : పలువురు న్యాయవాదులు
* కొత్త చట్టాలను నిరసిస్తూ ఆందోళనలు
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశంలో కొత్త నేర చట్టాలు (New Criminal Laws) అమల్లోకి వచ్చాయి. ఇక శిక్షలు కఠినం కానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్), భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ చట్టాలు ఆదివారం అర్ధరాత్రి (జులై 1, 2024) నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టం ప్రకారమే ఢిల్లీలోని ఓ వీధి వ్యాపారిపై తొలి కేసు నమోదైంది.
ఫిర్యాదులు సులభతరం
బాధితులు ఇకపై పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే ఆన్లైన్లోనే ఫిర్యాదులు చేయవచ్చు. ఎవరు.. ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. ఎలక్ట్రానిక్ మోడ్‌లో సమన్ల జారీ వంటి మార్పులను ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చాయి. పోలీస్ స్టేషన్‌కు రాకపోయినా డిజిటల్ పోలీస్ సిటిజన్ సర్వీసెస్ కింద క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ద్వారా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. అలాగే స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయొచ్చు. కొత్త చట్టం ప్రకారం క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ పరిశోధనను తప్పనిసరి చేశారు. క్రిమినల్ కేసులకు సంబంధించి మొదటి విచారణ జరిగిన 60 రోజుల్లోపు చార్జ్‌షీట్ దాఖలు చేయాలి. విచారణ పూర్తయిన 45 రోజులలోగా తీర్పు వెలువడాలి.
కొత్త చట్టంలో నేరము – శిక్ష ఇలా…
* చిన్నారులపై, బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష
* మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త చట్టాలలో ప్రత్యేక చాప్టర్
* మైనర్లను కొనడం, అమ్మడం కూడా నేరమే.
* పెళ్లి పేరుతో లైంగిక దోపిడీకి పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష
* కులం, మతం, జెండర్ వంటి కారణాలతో మూక దాడులకు పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష
* 60 నుంచి 90 రోజుల వరకు పోలీస్ రిమాండ్
* నకిలీ నోట్ల తయారీ, నోట్ల స్మగ్లింగ్‌కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం ఉగ్రవాద చట్టం కిందకు తెచ్చారు
ఉగ్రవాదానికి పెరోల్ లేని మరణశిక్ష : అమిత్ షా
దేశంలో ఇవాల్టి నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయని కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేశామన్నారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు కొత్త చాప్టర్ ఉంటుందన్నారు. ఉగ్రవాద నేరాలకు పాల్పడితే పెరోల్ లేని మరణ శిక్ష విధిస్తారన్నారు. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చిందన్నారు. ఆన్లైన్ లో ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సమ్మతమైన న్యాయ ప్రక్రియ అని అమిత్ వివరించారు. మూకదాడులకు పాల్పడితే యావజ్జీవ శిక్ష విధిస్తామన్నారు.
కాపీ.. పేస్ట్ చట్టాలు : న్యాయవాదులు
అయితే.. కొత్త చట్టాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిని రద్దు చేయాలని పలుచోట్ల న్యాయవాదులు ఆందోళనలు చేపడుతున్నారు. 90 శాతం ఉన్న పాత చట్టాలను కాపీ పేస్ట్ చేసి కొత్త చట్టాలని చెబుతున్నారని పలువురు న్యాయవాదులు విమర్శిస్తున్నారు. మన చట్టాలను మనం చేసుకున్నామన్న వాదనల్లో బలం లేదన్నారు. కొత్త సీసాలో పాత సారాలా ఈ చట్టాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈమేరకు విజయవాడలో విధులు బహిష్కరించి న్యాయవాదులు నిరసన తెలిపారు. ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అవకాశం లేకుండా కొత్త చట్టాలు రూపొందించారని వివరించారు. కొన్ని కేసుల్లో జీవితమంతా జైలులోనే ఉండే పరిస్థితులను తెస్తున్నారని, ప్రజల స్వేచ్ఛను హరించేలా కొత్త చట్టాలు ఉన్నాయని అన్నారు. విజయవాడతో పాటు దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కొత్త చట్టాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
———————————