*హైదరాబాద్ కిమ్స్‌కు తరలింపు
ఆకేరు న్యూస్, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు తెలిపిన వివరాల ప్రకారం.. జీవన్ రెడ్డి ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజులుగా జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ఆయన ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. వరుస పర్యటనలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం మరియు వాతావరణ మార్పుల వల్ల ఆయన శరీరానికి శ్రమ ఎక్కువై అనారోగ్యం బారిన పడ్డారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. అయితే, ఛైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి మరియు జీవన్ రెడ్డి వర్గానికి మధ్య కొంత రాజకీయ ఉత్కంఠ నెలకొంది. చివరకు అధిష్టానం జోక్యం చేసుకుని సంజయ్ వర్గానికి ఛైర్మన్ పదవిని, జీవన్ రెడ్డి వర్గానికి వైస్ ఛైర్మన్ పదవిని కేటాయించి వివాదాన్ని సర్దుమణిగించింది. ఈ రాజకీయ హడావుడి ముగిసిన వెంటనే ఆయన అనారోగ్యానికి గురికావడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, ఆయన కోలుకుంటున్నారని సమాచారం.
———————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
