* తొలి పింఛను స్వయంగా అందించిన చంద్రబాబునాయుడు
* పూరి గుడిసెలో టీ తాగి.. అరగంట ఆ ఇంట్లోనే
ఆకేరు న్యూస్, విజయవాడ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెరిగిన పింఛన్లను కూటమి ప్రభుత్వం ఈరోజే అందిస్తోంది. ఎన్నికలప్పుడు చెప్పినట్లుగానే గతంలో ఇచ్చే పెన్షన్‌కు అధనంగా వెయ్యి రూపాయలు కలిపి పంపిణీ చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. సచివాలయం సిబ్బంది ఇంటింటికీ తిరిగి పింఛన్లను అందిస్తున్నారు. అమరావతి (Amaravathi) పరిధిలోని పెనుమాక గ్రామానికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పెన్షన్ అందించారు. పూరి గుడిసెలో నివాసం ఉంటున్న బానావత్ పాములు నాయక్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్లారు. పాములు నాయక్‌కు వృద్ధాప్య పింఛన్.. అతని కుమార్తెకు వితంతు పెన్షన్ అందించారు. అదే సమయంలో తాము పూరి గుడిసెలో ఉంటున్నామని.. ఇళ్లు కావాలని పాములు నాయక్ చంద్రబాబును కోరారు. వెంటనే స్పందించిన చంద్రబాబు తప్పకుండా ఇంటిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు అరగంట పాటు పాములు నాయక్ ఇంట్లో చంద్రబాబు నాయుడు గడిపారు. వారి పిల్లలతో మాట్లాడి వారి చదువుల గురించి ఆరా తీశారు. వారు ఇచ్చిన టీ తాగారు.
పిఠాపురంలో డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే (Pvan Kalyan) అయిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గం పిఠాపురం (Pithapuram) వెళ్లారు. అక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం జరిగే అభినందన సభలో పాల్గొననున్నారు. కాగా, గత ప్రభుత్వం వృద్ధులకు రూ. 3 వేలు పింఛన్ అందించింది. ఎన్నిలకప్పుడు తాము అధికారంలోకి వస్తే రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నెరవేర్చారు. పెంచిన పెన్షన్ మొత్తం ఏప్రిల్ 1 నుంచి అమలయింది. మొత్తం రూ. 7 వేల పెన్షన్‌ను లబ్ధిదారులకు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షల మంది వయోవృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షణ్ అందజేస్తున్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు, మంచానికే పరిమితమయిన వారికి గత ప్రభుత్వం రూ. 5 వేల పెన్షన్ అందించింది. కానీ టీడీపీ ప్రభుత్వం దానికి రూ. 15 వేలు అందిస్తోంది. అలాగే కిడ్నీ, కాలేయ సమస్యలతో బాధపడుతున్నవారికి గత ప్రభుత్వం పింఛన్ రూ. 5 వేల ఇవ్వగా.. కూటమి ప్రభుత్వం రూ. 10 వేలు అందిస్తోంది.
———-