* 4న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ!
* నేటి రాత్రి లేదా రేపు ఢిల్లీకి రేవంత్
* మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు
* నిన్న రేవంత్, ఈరోజు స్పీకర్, సీఎస్ గవర్నర్ తో భేటీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు (Cabinet Expansion) వడివడిగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఈమేరకు కసరత్తు దాదాపు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సోమవారం మధ్యాహ్నమే గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను (CP Radhakrishnan) కలిశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను గవర్నర్‌కు వివరించారు.
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో గవర్నర్‌ను హైదరాబాద్‌లోనే ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. దాదాపు రెండు గంటలపాటు గవర్నర్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం కూడా రాజ్‌భవన్‌లోనే చేశారు. ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే చర్చ జరిగింది. ఈరోజు స్పీకర్ ప్రసాద్ కుమార్, సీఎస్ శాంతికుమారి (CS Shanthi Kumari) గవర్నర్ తో భేటీ కావడంతో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఇదే విషయమై నేటి రాత్రి లేదా రేపు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనేపథ్యంలో 4నే మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశ కనిపిస్తోంది.
నాలుగా.. ఆరా..?
రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో నాలుగు మాత్రమే ప్రస్తుతం భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రులతో పాటు, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7 నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానుండటంతో ఆ లోగా మంత్రివర్గ విస్తరణ జరగాలని పార్టీ భావిస్తోంది. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఇప్పటికే మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఈ మంత్రి వర్గ విస్తరణలో మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని చెప్పిన ఆయన..ఈ విస్తరణలో భాగంగా సీతక్కకు హోం మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడికి సైతం..
సీతక్కతో (Seethakka) పాటు ఇప్పటికే మంత్రిగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి, దానం నాగేందర్‌తో పాటు.. నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని దామోదర రాజనర్శింహ తెలిపారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారడం సహజమేనని ఆయన చెప్పారు. 2018 ఎన్నికల ముందు ప్యారాషూట్ నాయకులకు టిక్కెట్లు ఉండవని రాహుల్ గాంధీ చెప్పారని, కానీ మారిన పరిస్థితుల వల్ల వారికి టికెట్ల కేటాయింపు జరిగిందని గుర్తు చేశారు. మరోవైపు, టీపీసీసీ చీఫ్ నియామకం కూడా త్వరలోనే జరగనుంది.
—————————