Around 40 students fell ill in Bihar Nalanda district.
* 40 మంది పాఠశాల విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
ఆకేరు న్యూస్, డెస్క్: బీహార్‌లోని నలందా జిల్లాలో మధ్యాహ్న భోజన పథకంలో ఘోర నిర్లక్ష్యం వెలుగు చూసింది. పాఠశాల వంట మనిషి పొరపాటు కారణంగా కూరలో ఉప్పుకు బదులు డిటర్జెంట్ (సర్ఫ్) పౌడర్ కలపడంతో సుమారు 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపింది.
నలందా జిల్లాలోని పరసీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించారు. భోజనం చేస్తున్న సమయంలో కూరలో ఉప్పు తక్కువగా ఉందంటూ కొందరు విద్యార్థులు వంట మనిషిని అడిగారు. అయితే, కిచెన్‌లో ఉప్పు డబ్బా పక్కనే ఉన్న డిటర్జెంట్ పౌడర్‌ను వంట మనిషి పొరపాటున ఉప్పుగా భావించి విద్యార్థులకు ఇచ్చింది. ఆ పౌడర్‌ను కూరలో కలుపుకొని తిన్న కాసేపటికే పిల్లలకు కడుపునొప్పి, గొంతు మంట, వాంతులు ప్రారంభమయ్యాయి.
* మంత్రి పరామర్శ..
ఒక్కసారిగా దాదాపు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. బాధిత పిల్లలను బిహార్షరీఫ్ సదర్ ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించారు. సమాచారం అందుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ వెంటనే ఆస్పత్రికి చేరుకుని పిల్లల ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
వైద్యుల సమయానుకూల చికిత్స వల్ల విద్యార్థులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారని, ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి శ్రవణ్ కుమార్, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
