Telangana Rainfall Forecast
* దక్షిణ తెలంగాణలో లోటు వర్షపాతం
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షపాతంలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, రాబోయే 10 నుండి 15 రోజుల్లో రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు వాతావరణ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం ఏర్పడుతున్న అల్పపీడన ప్రభావం ప్రధానంగా ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, విదర్భ వైపు కదులుతుండటంతో తెలంగాణపై దీని ప్రభావం పరిమితంగానే ఉండనుంది.
* ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు..
అల్పపీడన ప్రభావంతో ఆగస్టు 22 లేదా 23 నుండి ఆగస్టు 27 మధ్య ఉత్తర, తూర్పు తెలంగాణ పరిధిలోకి వచ్చే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 5 నాటికి ఈ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది
* దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ పరిస్థితి..
దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మాత్రం సెప్టెంబర్ 5 వరకు లోటు వర్షపాతం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే, రాబోయే రోజుల్లో అప్పుడప్పుడు మోస్తరు జల్లులు పడినప్పటికీ, మొత్తంమీద సెప్టెంబర్ మొదటి వారం వరకు వర్షపాతం సాధారణం కంటే కాస్త తక్కువగానే నమోదు కావచ్చు.
* రైతులకు సూచన..
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా రాబోయే 10 రోజుల్లో చెల్లుబాటు అయ్యే భారీ వర్ష సూచనలు లేనందున, రైతులు మరియు సామాన్య ప్రజలు తమ వ్యవసాయ, రోజువారీ పనులను ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
