Konda Surekha TPCC Notice
* పీసీసీ నోటీసులపై మంత్రి కొండా సురేఖ సంచలన వివరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేపిన కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపై ఆమె తల్లి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ మేరకు గురువారం ఆమె తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) క్రమశిక్షణా కమిటీకి అధికారికంగా లేఖ రూపంలో వివరణ ఇచ్చారు.
తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. వేరొకరి అభిప్రాయాలకు లేదా వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని గుర్తించాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలోనే, తన కుమార్తె మాట్లాడిన మాటల ఆధారంగా తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పీసీసీ క్రమశిక్షణా కమిటీని కోరారు. కాంగ్రెస్ పార్టీ, దాని క్రమశిక్షణా నియమావళి మరియు అధిష్ఠానం పట్ల తనకు సంపూర్ణ గౌరవం ఉందని ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ పునరుద్ఘాటించారు.
* వివాదం నేపథ్యం..
ఇటీవల వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన ఒక కార్యక్రమంలో కొండా సుస్మిత పాల్గొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
రాబోయే ఎన్నికల్లో పరకాల స్థానం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ, మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి స్పందిస్తూ పీసీసీకి తన సమాధానాన్ని పంపించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
