Telangana Polytechnic New Courses
* ఫీజుల్లో మార్పు లేదు, భూముల విక్రయం అవాస్తవం
– మంత్రి వివేక్ క్లారిటీ
* ఆధునిక అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ కోర్సులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను నేటి ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేస్తున్నామని, అందులో భాగంగానే నూతన కోర్సులను ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఇటీవల పాలిటెక్నిక్ కళాశాలలపై వస్తున్న పలు రకాల పుకార్లకు ఆయన చెక్ పెట్టారు.
పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, ఇతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధివిధానాలు మరియు ఉద్యోగ షరతులే మున్ముందుకూ కొనసాగుతాయని, కేవలం డిపార్ట్మెంట్ పేరు మాత్రమే మారుతుందని వెల్లడించారు. ఈ మార్పుల వల్ల ఉద్యోగులకు, సిబ్బందికి ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన భరోసా ఇచ్చారు.
* ‘భూముల విక్రయం అవాస్తవం.. ఫీజుల్లో మార్పులేదు’
విద్యార్థుల ఫీజుల విషయంలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ, పాలిటెక్నిక్ కళాశాలల ఫీజుల నిర్మాణంలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పారు. అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విలువైన భూములను ప్రభుత్వం విక్రయిస్తోందంటూ సోషల్ మీడియాలో, ప్రతిపక్షాల నుంచి జరుగుతున్న ప్రచారం కేవలం దుష్ప్రచారమేనని, అది ముమ్మాటికీ అవాస్తవమని కొట్టిపారేశారు.
ప్రభుత్వం సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు, యువతకు నాణ్యమైన ఉపాధి నైపుణ్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటుంటే.. ప్రతిపక్షాలు కావాలని అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలు, విద్యార్థులు ఇటువంటి నిరాధారమైన ప్రచారాలను నమ్మవద్దని మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
