MLA Tudi Megha Reddy, Wanaparthy Congress internal rift
* సీనియర్ నేత చిన్నారెడ్డిపై ఏఐసీసీకి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి కాంగ్రెస్ రాజకీయాల్లో వర్గపోరు మరోసారి తీవ్రస్థాయికి చేరింది. సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీసీసీ, ఏఐసీసీ నేతలపై మాట్లాడే స్థాయికి చిన్నారెడ్డి వచ్చారని, ఆయన చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు.
ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ జాతీయ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లాకు చెందిన ముఖ్యాధికారులు, నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌లను కలిసి చిన్నారెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
* ‘పార్టీ ఏం తక్కువ చేసింది?’
“కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డికి ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చింది. పదవులు కల్పించింది, అయినా ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, సీనియర్లను, స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారు” అని మేఘారెడ్డి దుయ్యబట్టారు. చిన్నారెడ్డి వ్యవహరిస్తున్న తీరు వల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని, ఆయన చేసిన ఆరోపణల వెనుక ఉన్న అసలు వివరాలను ఆధారాలతో సహా అధిష్ఠానానికి సమర్పిస్తామని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే వనపర్తి నియోజకవర్గంలో రగులుతున్న అంతర్గత విభేదాలు, నేడు ఢిల్లీ వేదికగా ఏఐసీసీ పంచాయితీగా మారడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
