Five Day Bank Workweek
* 5 రోజుల పనిదినాల కోసం బ్యాంకు ఉద్యోగుల పాదయాత్ర
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
వారానికి 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కెనరా బ్యాంకు ఉద్యోగులు (హన్మకొండ నుంచి హైదరాబాద్) చేపట్టిన పాదయాత్ర శుక్రవారం స్టేషన్ ఘన్ పూర్ చేరుకోగా స్థానిక కెనరా బ్యాంకు బ్రాంచి మేనేజర్ భూక్య కృష్ణ వారికి స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా సీబీఓఏ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కేలోతు రవి, రీజనల్ సెక్రటరీలు ధరావత్ విక్రమ్, ఎస్.డి. ప్రసాద్ మాట్లాడుతూ తాము కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదని, 2022 నవంబర్ లో జరిగిన 12వ వేతన సవరణ సందర్భంగా వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు అది అమలుకు నోచుకోలేదని వారు తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలనే డిమాండ్ తోనే పాదయాత్ర చేపట్టినట్లు వారు వివరించారు.
హామీ అమలు చేసే వరకు తాము నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆగస్టు 12 నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు పని వేళలు ముగిసిన అనంతరం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వారు తెలిపారు. ఐబీఏ ఇచ్చిన హామీ అమలయ్యే వరకు వివిధ రూపాల్లో తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. పాదయాత్ర మార్గమధ్యలోని కెనరా బ్యాంకు ఇతర బ్రాంచ్ ల ఉద్యోగులు కూడా తమతో కలిసి సంఘీభావం ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొంటారని వారు పేర్కొన్నరా. కెనరా బ్యాంకుకు చెందిన 110 బ్రాంచ్ ల నుంచి సుమారు 70 మంది ఉద్యోగులు పాల్గొన్నారని, రోజుకు సుమారు 50 కిలోమీటర్ల చొప్పున మూడు రోజుల్లో హైదరాబాద్ కు చేరుకునేలా పాదయాత్రను కొనసాగిస్తున్నట్లు వారు వివరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
