Telangana BJP chief Ramchander Rao Hunger Strike
* బీజేపీ కార్యాలయంలో కొనసాగుతున్న ఆకలి దీక్ష
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫీజుల బకాయిలు – రీ ఇంబర్స్ మెంట్‌పై భారతీయ జనతా పార్టీ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచర్‌రావు దీక్షకు కూర్చున్నారు. ఆకలి దీక్ష పేరుతో సోమవారం ఉదయం ప్రారంభించారు. ఆయన చేస్తున్న దీక్షకు బీజేపీ ఎంపీలు, నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. రెండో రోజు కూడా దీక్ష కొనసాగుతోంది.
* ఫీజుల బకాయి – బీజేపీ లడాయి..
తెలంగాణలో విద్యార్థులకు సంబంధించిన దాదాపు 15,000 కోట్ల రూపాయిల ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని రామచందర్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఆ బకాయిలును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫీజుల బకాయి – బీజేపీ లడాయి పేరుతో నిన్న ప్రారంభమైన దీక్ష ఈరోజు కూడా కొనసాగుతోంది.
* పోలీసుల అనుమతి నిరాకరణ
తొలుత ఈ దీక్షను ఇందిరాపార్కు వద్ద గల ధర్నా చౌక్‌లో తలపెట్టాలని బీజేపీ భావించింది. అయితే శాంతిభద్రతల కారణాలను చూపి హైదరాబాద్ పోలీసులు అక్కడ దీక్ష చేయడానికి అనుమతి నిరాకరించారు. దీంతో దీక్షను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి మార్చారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, ఉన్నత విద్యా అవకాశాలు దెబ్బతింటున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు.
* ఎంపీ ఈటల మద్దతు
రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న దీక్షా శిబిరం వద్దకు సంఘీభావంగా పలువురు బీజేపీ ముఖ్య నేతలు, శ్రేణులు, విద్యార్థి విభాగాల ప్రతినిధులు తరలివస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేరుకుని రామచందర్ రావుకు సంఘీభావం తెలిపారు. ఫీజులు చెల్లించని కారణంగా కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
