Ponnam Prabhakar Mutharam Visit
* లంబాడీ తండా రహదారి అభివృద్ధికి రూ.3.74 కోట్లు మంజూరు
* కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి
* ఓటు హక్కును కాపాడుకోవాలి
– మంత్రి పొన్నం ప్రభాకర్
* హుస్నాబాద్ నియోజకవర్గంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లెలో ప్రజా పాలన”
ఆకేరు న్యూస్, హనుమకొండ : హుస్నాబాద్ నియోజకవర్గంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ముత్తారం చౌరస్తా నుంచి గట్ల నర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామానికి చేరుకున్న మంత్రి ముందుగా బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామస్తుల నుంచి వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముత్తారం గ్రామంలో 8 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలో రెండో దశలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 31వ తేదీ వరకు పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, తలసేమియా, హెచ్ఐవీ బాధితులు తదితర అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నీటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని, ముత్తారం ప్రభుత్వ పాఠశాలకు పెయింటింగ్ వేయిస్తామని హామీ ఇచ్చారు. యువత మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా క్రీడా మైదానాలకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే మంచి గుర్తింపు రావడంతో పాటు, క్రీడా సర్టిఫికెట్ల ద్వారా ఇండియన్ ఆర్మీ, పోలీస్ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించేందుకు జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు కృష్ణను నియమించామని, నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో క్రీడా సామగ్రి అందించామని చెప్పారు. ముత్తారం గ్రామానికి క్రికెట్, వాలీబాల్ తదితర క్రీడా సామగ్రితో పాటు ఓపెన్ జిమ్ అందించినట్లు తెలిపారు. ఇటీవల హుస్నాబాద్ మినీ స్టేడియంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించి వారు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలు తమ ఆర్థిక కార్యకలాపాలను పెంచుకునేలా రుణ పరిమితులను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచామని చెప్పారు. ఎస్ఐఆర్ నో మ్యాపింగ్లో భాగంగా ముత్తారం గ్రామానికి చెందిన 22 మంది ఓటర్లకు నోటీసులు అందినట్లు మంత్రి తెలిపారు. సంబంధిత ఓటర్లు సరైన వివరాలను బీఎల్ఓలకు అందించి తమ ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గురవయ్య, జిల్లా, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ ఊరడి భారతి జైపాల్ రెడ్డి, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
