Kalayayagna Mini Art Exhibition
* ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శనలు
* 14 రోజుల పాటు 7 అంశాలపై నిర్వహణ
* ఆసక్తిగా తిలకించిన కళాభిమానులు
ఆకేరు న్యూస్, హనుమకొండ : హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి చిత్రకళా కార్యక్రమం ‘కళాయజ్ఞ మినీ’ సోమవారం ముగిసింది. జూలై లో ప్రారంభమైన ఈ కార్యక్రమం 14 రోజుల పాటు ఏడు ప్రత్యేక అంశాలపై నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి 50 మందికి పైగా చిత్రకారులు ఈ కళాయజ్ఞంలో పాల్గొని 350కి పైగా చిత్రాలను రూపొందించారు. ఆయా కళాకారులు రూపొందించిన చిత్రాల్లో నుంచి ప్రతిఒక్కరికి సంబంధించిన ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన చిత్రాలతో హైదరాబాద్లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాల నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ దర్శకుడు శివ నాగేశ్వరరావు, ప్రముఖ రచయితతో పాటు పలువురు అతిథులు పాల్గొని కళాకారులను అభినందించారు. చిత్రకళా రంగంలో ప్రతిభ కనబరిచిన కళాకారులను ప్రత్యేకంగా సన్మానించారు. కళాకారులకు తమ ప్రతిభను జాతీయస్థాయిలో ప్రదర్శించేందుకు ‘కళాయజ్ఞ మినీ’ వంటి కార్యక్రమాలు మంచి వేదికగా నిలుస్తాయని అతిథులు పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిత్రకారులు ఒకే వేదికపై తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం విశేషమని కొనియాడారు. అలాగే 50 మందికి పైగా చిత్రకారులు, వందలాది మంది చిత్రకళా ప్రియులు ప్రదర్శనను సందర్శించి చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. కళాకారుల సృజనాత్మకతకు ప్రతిబింబంగా నిలిచిన ఈ చిత్రకళా ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. కార్యక్రమంలో సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ డా. సాగంటి మంజుల, ప్రముఖ చిత్రకారులు డాకోజు శివప్రసాద్, చిత్ర, జయశ్రీ ప్రభాకర్, చిప్పకుర్తి శ్రీనివాస్, దార్ల నాగేశ్వరరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
