Bank Strike September 2026
ఖాతాదారులు జాగ్రత్త
* ఆ రోజుల్లో బ్యాంకులు బంద్
* వరుసగా మూసివేత..
* ఉద్యోగుల సమ్మె
ఆకేరు న్యూస్, డెస్క్:
దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఖాతాదారులకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కీలక హెచ్చరిక జారీ చేసింది. వారానికి 5 రోజుల పని దినాల ప్రతిపాదన అమలుతో పాటు, కొత్త పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ విధానం సవరణ, పెన్షన్ సంబంధిత డిమాండ్ల సాధనకు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో యూఎఫ్-బీయÖ ప్రతినిధులు సమ్మె ప్రణాళికను వెల్లడించారు. వారానికి 5 రోజుల పని దినాల ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తోందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
* సమ్మె తేదీలు..
సెప్టెంబర్ 11 (శుక్రవారం)ఒక రోజు దేశవ్యాప్త బ్యాంకర్ల సమ్మె. సెప్టెంబర్ 28, 29, 30 వరుసగా 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్. అక్టోబర్ 26 నుంచి తమ డిమాండ్లు నెరవేర్చకపోతే నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయం.
* కస్టమర్లకు 3-4 రోజుల పాటు సేవలు బంద్..
సెప్టెంబర్ 11న శుక్రవారం సమ్మె జరగనుండగా, ఆ తర్వాత సెప్టెంబర్ 12 (రెండో శనివారం), సెప్టెంబర్ 13 (ఆదివారం) వరుసగా సాధారణ సెలవులు ఉన్నాయి. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 14న వినాయక చతుర్థి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది. దీంతో బ్యాంకింగ్ లావాదేవీలకు వరుసగా 3 నుంచి 4 రోజుల పాటు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. చెక్కుల క్లియరెన్స్, డ్రాఫ్ట్లు, నగదు డిపాజిట్లు వంటి పనులు నిలిచిపోనున్నాయి. ఖాతాదారులు అత్యవసర బ్యాంక్ పనులు, నగదు లావాదేవీలను ముందే పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉన్నా, బ్రాంచ్ సేవలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
