BRS Mulugu Farmers Protest
* రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ సవితి తల్లి ప్రేమ
* బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు
* ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి
ఆకేరు న్యూస్,ములుగు : రైతు లేనిదే రాజ్యం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల సవతి తల్లి ప్రేమను చూపుతోందని బి.ఆర్.ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు, ములుగు నియోజకవర్గ ఇంచార్జీ బడే నాగ జ్యోతి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం గోవిందరావుపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమం గోవిందరావుపేట లోని తహసిల్దార్ కార్యాలయం నుంచి ఎద్దుల బండ్లతో మొదలైన ర్యాలీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది.
ఈ సంద ర్భంగా లక్ష్మణ్ బాబు, నాగజ్యోతి లు మాట్లాడుతూ. బిఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమ ధ్యేయంగా రెండు ధపాలుగా పాలన అందించిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలకు పరిష్కారం చూపకుండా సభలు, సమావేశాలు, ఉపన్యాసాల పేరుతో కాలయాపన చేస్తూ, ప్రతి సమస్యకూ గత ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని వారు ఆరోపించారు. ములుగు ప్రాంత రైతాంగానికి లక్నవరం జలాశయం పై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో లక్నవరం సమస్యను పదే పదే ప్రస్తావించిన మంత్రి సీతక్క అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారానికి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు.

మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లక్నవరం నీటిని జంపన్నవాగుతో అనుసంధానం చేసేందుకు రూ.36 కోట్లతో చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని, ఆ హామీ అమలుపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. 2024లో కురిసిన వడగండ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించారని, ములుగు ప్రాంతానికి సంబంధించి రూ.5.75 కోట్ల నిధులు విడుదలయ్యాయని, రైతు పేరుతో విడుదలైన నిధులు అర్హులైన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతు పెట్టుబడి సాయాన్ని పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని పూర్తి స్థాయిలో ప్రయోజనం అందడం లేదని విమర్శించారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించి, అర్హులైన రైతులందరికీఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.ములుగు జిల్లాలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గతంలో చేపట్టిన దేవాదుల, సమ్మక్క బ్యారేజ్ వంటి ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వారు సూచించారు. ములుగు జిల్లాలో పోడు భూమిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన కుటుంబాలకు హక్కుల స్పష్టత కల్పించడం అవసరమని అన్నారు.అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రతి సమస్యకు గత ప్రభుత్వాన్ని బాధ్యుడిగా చూపడం వల్ల సమస్యలు పరిష్కారం కావని,గత ప్రభుత్వంలో తప్పులపై విచారణ జరిపించాలని అన్నారు.అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న ఇప్పటికీ గత పాలననే ప్రధాన రాజకీయ అంశంగా చేసుకోవడం కంటే, తమ ప్రభుత్వం సాధించిన ఫలితాలపై ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.రైతు సమస్యలను విడి విడిగా కాకుండా నీరు–పెట్టుబడి–పంట ధర–పరిహారం–భూ హక్కులు అనే సమగ్ర వ్యవసాయ విధానంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను గల్లి గల్లికి ఎండగడ తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు గోవింద నాయక్, మల్క రమేష్,భూక్యా జంపన్న, ల తో పాటు బి ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
