Janasena 22A Protest in Hyderabad
* 22ఏపై ఇందిరాపార్కు వద్ద ఆందోళన
* ప్రభుత్వాల భూ దోపిడీ పాలంటూ డిమాండ్
అకేరు న్యూస్,హైదరాబాద్: గతంలో పాలించిన బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి భారీ భూ అక్రమాలకు పాల్పడుతున్నాయని తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో సాధించుకున్న తెలంగాణలో పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతులు, నిరక్షరాస్యులైన సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ‘ధరణి’ పేరుతో లక్షలాది ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడితే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’, 22ఏ పేరుతో అదే తరహా దోపిడీకి కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు.
* ఇందిరాపార్క్ వద్ద ‘జనసేన’ నిరసన దీక్ష
22ఏ జిఓ వల్ల నష్టపోయిన బాధితులకు మద్దతుగా, ఈ జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారహిత విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రజలకు అన్యాయం చేస్తున్న మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని, అలాగే మోదీ, కాంగ్రెస్ పార్టీలని ఉద్దేశించి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 22ఏ జీఓను రద్దు చేసేవరకు జనసేన బాధితుల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.
* ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి
జనసేన ప్రచార కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులను పక్కనబెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం తమకు నచ్చిన వారికే పదవులు కట్టబెడుతోందని ఆరోపించారు. 22ఏ బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం తక్షణమే ‘ఫాస్ట్ ట్రాక్ కోర్టులను’ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజా గొంతుకగా నిలిచి, ప్రభుత్వం చేపట్టే ప్రతి ప్రజా వ్యతిరేక విధానంపై జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు.
* కార్యక్రమంలో భారీగా పాల్గొన్న నేతలు, బాధితులు
ఈ నిరసన దీక్షకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 22ఏ బాధిత రైతులు, ప్రజలతో పాటు జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు దుంపటి శ్రీనివాస్, రాజలింగం, మాధవరెడ్డి, సుధాకర్, శిరీష, మచ్చ సుధాకర్‌గౌడ్, ప్రజీద్గౌడ్, గడల శ్రీనివాసరావు, డాక్టర్ సాగర్లతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు, అభిమానులు పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
