* కాల్పుల అనంతరం మీడియా ముందుకు ట్రంప్
ఆకేరు న్యూస్ డెస్క్ : ఎన్నికల ప్రచారంలో ఉండగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సహా దేశ విదేశాల ప్రముఖులందరూ ఈఘటనపై స్పందించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ సైతం ఈ దుశ్చర్యను ఖండించారు. కాగా, కాల్పుల్లో చిన్నపాటి గాయమైన ట్రంప్ త్వరగానే కోలుకున్నారు. పెన్సిల్వేనియా జరిగిన ఈ అటాక్ తర్వాత ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఆ ఘటన తాలూకు వివరాలను వెల్లడించారు. తాను ఈపాటికే చనిపోయి ఉండేవాడినని, బహుశా దేవుడు కాపాడాడేమో అని అన్నారు. దాడి జరిగిన సమయంలో తాను తన తలను సరైన సమయంలో.. సరైన దిశలో మళ్లించినట్లు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. చెవిలోకి దూసుకెళ్లిన ఆ బుల్లెట్ ఈజీగా తన ప్రాణాలను తీసి ఉండేందన్నారు. బహుశా చనిపోయేవాడినని, ఇక్కడే ఉండేవాడిని కాదేమో అని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనను తామెప్పుడూ చూడలేదని తనకు చికిత్సను అందించిన డాక్టర్లు పేర్కొన్నారని, ఇదో అద్భుతం అని చెప్పారని ట్రంప్ వెల్లడించారు. ఇది అదృష్టమో లేక దేవుడి దయో.. కానీ చాలా మంది మాత్రం దేవుడి దయ వల్లే తాను బ్రతికి ఉన్నట్లు చెబుతున్నారన్నారు. ముఖంపై రక్తం ఉన్నా.. అటాక్ సమయంలో పిడికిలి బిగించి ఉన్న ఫోటో గురించి కామెంట్స్ వస్తున్నాయని, ఇలాంటి ఫోటోను తాము ఎప్పుడూ చూడలేదని ప్రజలు చెబుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అటాక్ జరిగిన తర్వాత కూడా ప్రసంగించాలనుకున్నానని, కానీ సీక్రెట్ షర్వీస్ ఏజెంట్లు తనను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తన యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఫోన్ చేసిన బైడెన్ (Biden) కు కృతజ్ఞతలు తెలిపారు.
——————————————————————