FCV Tobacco Prices Andhra Pradesh
* మార్కెట్లో పుంజుకుంటున్న వ్యాపారం
* ధర పెరుగుదలతో సానుకూల వాతావరణం
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 2025–26 సీజన్ ఎఫ్‌సీవీ పొగాకు వేలాలు పుంజుకోవడంతో రైతులకు బిగ్ రిలీఫ్ లభించింది. మార్కెట్లో దిగుబడి అధికమై తొలినాళ్లలో కొంత ఒత్తిడి నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం రంగంలోకి దిగడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. వేలం కేంద్రాల్లో ‘నో-బిడ్’ బేల్స్ శాతం దాదాపు 11–12 శాతానికి పడిపోగా, కొన్ని చోట్ల ఇది కేవలం 1–2 శాతానికే పరిమితమైంది. NLS ప్రాంతంలో అత్యధికంగా కిలోకు రూ. 329 వరకు ధర పలుకుతుండటం మార్కెట్లోని సానుకూల వాతావరణానికి నిదర్శనంగా నిలిచింది.
* రైతు ప్రయోజనాలే లక్ష్యం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా చర్యలు చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సీజన్లో 132 వేలం రోజుల నాటికి 86.59 మిలియన్ కిలోల పొగాకు విక్రయమవగా, సగటు ధర రూ. 209.83గా నమోదైంది. రైతులు, ఎగుమతిదారులు మరియు అధికారులతో మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయి వేలం ప్రక్రియను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
* టొబాకో బోర్డు ద్వారా..
మరోవైపు, ప్రస్తుత సీజన్లో అనుమతించిన 142 మిలియన్ కిలోల స్థానంలో ఏకంగా 236 మిలియన్ కిలోల ఉత్పత్తి జరగడంతో మార్కెట్‌పై భారం పడింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, వచ్చే 2026–27 పంట కాలానికి అనుమతించబడే పరిమాణాన్ని 81 మిలియన్ కిలోలకు క్రమబద్ధీకరించినట్లు మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో పంట మిగులు సమస్య రాకుండా చూసేందుకు డిమాండ్‌కు తగ్గట్టుగానే సాగు చేసేలా టొబాకో బోర్డు ద్వారా రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
