Kalvakuntla Kavitha Fee Reimbursement Protest
* ప్రభుత్వంపై కవిత ఆగ్రహం
*హన్మకొండలో కలెక్టరేట్ ముట్టడి
* సర్టిఫికెట్లు తక్షణమే ఇవ్వాలి
ఆకేరు న్యూస్, హన్మకొండ: రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో హన్మకొండలో భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులతో కలిసి హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ర్యాలీ ప్రారంభానికి ముందు కవిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థపై అవగాహన లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఒకసారి ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని ఎత్తివేస్తామని, మరోసారి పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తామని గందరగోళ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో, లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీలు మరియు ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసినప్పటికీ కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థులు ఉద్యోగాలు సాధించలేక భవిష్యత్తును కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగివచ్చి ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ పూర్తిగా చెల్లించే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
