Police imposed Section 144 at KCR’s Eravalli farmhouse
* ఎర్రవల్లిలో 144 సెక్షన్ విధింపు
* పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులు
ఆకేరు న్యూస్, సిద్దిపేట :
సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ సీఎం కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్ హౌస్‌ను ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఎర్రవల్లి పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
* అసెంబ్లీ స్పీకర్‌పై వ్యాఖ్యలే వివాదానికి కారణం
ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం శాసనసభలో జరిగిన పరిణామాలేనని తెలుస్తోంది. రాజ్యాంగబద్ధమైన శాసనసభాపతి (స్పీకర్) పదవిలో ఉన్న వ్యక్తిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించడం అంటే మొత్తం దళిత సమాజాన్ని హేళన చేయడమేనని మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
* డప్పుల మోతతో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి దళిత నేతలు, కార్యకర్తలు గజ్వేల్ వైపు తరలివచ్చారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు డప్పులు కొడుతూ నిరసన తెలిపారు. ఎర్రవల్లి వైపు వెళ్లే మార్గాల్లో బైఠాయించి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచే రాజకీయాలు నడుపుతున్నారని, నేరుగా అక్కడికే వెళ్లి నిలదీస్తామని ఆందోళనకారులు స్పష్టం చేశారు.
* ఎర్రవల్లిలో పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులు
ఎర్రవల్లి లో 144 సెక్షన్ అమలులోకి తెచ్చారు. ఫామ్ హౌస్‌కు వెళ్లే దారులన్నింటిలో బారికేడ్లు పెట్టి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిరసన తెలపడానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను సరిహద్దుల్లోనే అడ్డుకుని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
* కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం
ఈ ఘటనపై ఇరు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు నడుస్తున్నాయి. స్పీకర్ పదవి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, కేసీఆర్ సమాధానం చెప్పే వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ ముట్టడి పిలుపును బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ ఈ నాటకాలు ఆడుతోందని, ఫామ్ హౌస్ వైపు వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో అక్కడక్కడా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటలు జరుగుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
